Photo Credit: CSA Twitter
సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వన్డే క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్ల హాల్ నమోదు చేశాడు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ (22 వికెట్లు).. పాట్ సిమ్‌కాక్స్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అంతేకాదు కేశవ్ మహరాజ్‌కు వన్డేల్లో ఇది ఐదో నాలుగు వికెట్ల హాల్ కాగా, ఓవరాల్‌గా అత్యధిక సార్లు నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసిన రెండో స్పిన్నర్‌గా నిలిచాడు.
తొలి స్థానంలో ఇమ్రాన్ తాహిర్ (10 సార్లు) కొనసాగుతున్నాడు. ఇక ఆస్ట్రేలియాపై వన్డేల్లో కేశవ్ మహరాజ్ సాధించిన (4/20) వికెట్ల ప్రదర్శన సౌతాఫ్రికా తరఫున రెండో అత్యుత్తమం. 2002లో కేప్‌టౌన్ వేదికగా ఆసీస్‌పై నికీ బోజే (5/12) వికెట్ల ప్రదర్శన తొలి అత్యుత్తమంగా ఉంది. ఇక సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా, ఈ నాలుగుసార్లు సఫారీలు తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్‌కే (106 బంతుల్లో 112) శతకం సాధించగా, మార్కో జాన్సన్ (75) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదన ప్రారంభించిన ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (60) అర్థసెంచరీతో రాణించగా, మాట్ రెన్‌షా (44) పర్వాలేదనిపించాడు. కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు తీయగా, కార్బిన్ బోస్క్, జోర్న్ ఫోర్టిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇదీ చదవండి: Asian Games 2026: సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్


