IND vs WI: విండీస్‌తో రెండో వన్డే.. భారత తుదిజట్టులో మార్పు! | IND vs WI That Case He is not bowler: Aakash Chopra Suggests 1 change | Sakshi
Sakshi News home page

IND vs WI: విండీస్‌తో రెండో వన్డే.. భారత తుదిజట్టులో మార్పు!

Sep 29 2026 2:10 PM | Updated on Sep 29 2026 2:58 PM

IND vs WI That Case He is not bowler: Aakash Chopra Suggests 1 change

కెప్టెన్‌ గిల్‌ నుంచి క్యాప్‌ అందుకున్న నమన్‌ (PC: BCCI X)

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో వన్డేకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య బుధవారం (సెప్టెంబరు 30) జరిగే ఈ మ్యాచ్‌కు గువాహటిలోని బర్సపరా క్రికెట్‌ స్టేడియం వేదిక.

తుదిజట్టులో మార్పు అనివార్యం
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా టీమిండియా యాజమాన్యానికి కీలక సూచన చేశాడు. తుదిజట్టులో ఒక మార్పు చేయక తప్పదని.. నమన్‌ ధిర్‌ను తప్పించాలని సూచించాడు. కాగా పంజాబ్‌కు చెందిన నమన్‌ లిస్ట్‌- ఎ మ్యాచ్‌లలో 11 ఇన్నింగ్స్‌ ఆడి 351 పరుగులు చేశాడు.

అందుకే అతడిని ఆడించారు
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడి అనుభవం కూడా నమన్‌కు ఉంది. అయితే, అతడిని స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తూ విండీస్‌ తొలి వన్డే సందర్భంగా టీమిండియా యాజమాన్యం అరంగేట్రం చేయించింది. వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ జట్టుతో లేని కారణంగా.. రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లతో పాటు నమన్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడించింది. లోయర్‌లో బ్యాటింగ్‌కు పనికివస్తాడని ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మ్యాచ్‌లో నమర్‌ ధిర్‌ ఐదు ఓవర్ల బౌలింగ్‌లో 33 పరుగులు ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. ఇక లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ శతకాలతో చెలరేగిన కారణంగా.. అతడికి బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరమే రాలేదు. ఈ నేపథ్యంలో నమన్‌ పేరుకే ఆల్‌రౌండర్‌ అని.. కానీ అతడికి బౌలర్‌గా రాణించే సత్తా లేదని మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ వంటి వారు విమర్శించారు.

ఈ మ్యాచ్‌కు అతడు పనికిరాడు
తాజాగా మరో మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం 26 ఏళ్ల నమన్‌ ధిర్‌ ఎంపికను ప్రశ్నించాడు. రెండో వన్డే తుదిజట్టు నుంచి అతడిని తొలగించి.. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఆడించాలని సూచించాడు. ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ..

‘‘టాస్‌ మన నియంత్రణలో లేని అంశం. ఒకవేళ బర్సపరా స్టేడియంలో మనం లైట్ల వెలుగులో బౌలింగ్‌ చేయాల్సి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ మంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహ్మద్‌ సిరాజ్‌ను ఎందుకు తుదిజట్టులోకి తీసుకోకూడదు?.. తప్పకుండా ఆడించవచ్చు.

సిరాజ్‌ ఆడితే బెటర్‌
దీనర్థం నేను నమన్‌ ధిర్‌కు వ్యతిరేకం అని కాదు. సిరాజ్‌ను ఆడిస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నమన్‌ కేవలం పార్ట్‌టైమ్‌ బౌలర్‌ మాత్రమే. అతడు వికెట్లు తీయలేడు. ఒకవేళ తేమ ఎక్కువగా ఉందంటే అతడు ఒక్క ఓవర్‌ కూడా వేయలేడు.

అలాంటపుడు నలుగురు బౌలర్లతో రంగంలోకి దిగాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో డెప్త్‌ కోసమని.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ ఆప్షన్‌ కావాలనే ఆలోచనతో నమన్‌ను ఆడించవద్దు. గువాహటి మ్యాచ్‌కు మాత్రం నమన్‌ సరైన ఆప్షన్‌ కానేకాదు’’ అని ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. కాగా సిరాజ్‌ చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా వన్డే ఆడాడు.

వెస్టిండీస్‌ తొలి వన్డేలో ఆడిన భారత తుదిజట్టు
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), నమన్‌ ధిర్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, గుర్నూర్‌ బ్రార్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.

రెండో వన్డేకు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, గుర్నూర్‌ బ్రార్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌.

చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. భారత ఓపెనర్‌ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement