source: X
భారత్‌తో ఇవాళ జరుగబోయే రెండో వన్డేకు ముందు వెస్టిండీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డే సెంచరీ హీరో జస్టిన్ గ్రీవ్స్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాలి కండరాలకు గాయం కావడంతో గ్రీవ్స్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది.
తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో గ్రీవ్స్ అద్భుతంగా రాణించాడు. 108 బంతుల్లో 101 పరుగులు చేసి తన కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆ ఇన్నింగ్స్ సమయంలోనే అతడి కాలి కండరాలకు గాయమైంది. దీంతో అతడు ఆతర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.
తొలి వన్డేలో వెస్టిండీస్ 295 పరుగులు చేయడంలో గ్రీవ్స్‌ది ప్రధానపాత్ర. ఆ మ్యాచ్‌లో గ్రీవ్స్ సత్తా చాటకపోయుంటే విండీస్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగేది కాదు. గ్రీవ్స్‌తో పాటు జాన్ క్యాంప్‌బెల్ (62), ఆమిర్ జాంగూ (58 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ 300 పరుగుల మార్కుకు దగ్గరగా చేరగలిగింది.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (110), విరాట్ కోహ్లి (139 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో విండీస్‌కు పరాజయం తప్పలేదు. గిల్, విరాట్ విండీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించడంతో భారత్ మరో 8.2 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే గౌహతి వేదికగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీఘడ్‌లో జరుగనుంది.
మూడు వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్ తర్వాత అక్టోబర్ 6, 9, 11, 14, 17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి.
ఇదీ చదవండి: IND vs WI: విండీస్‌తో రెండో వన్డే.. భారత తుదిజట్టులో మార్పు!


