source: X
భారత మాజీ ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బీసీసీఐ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడంతో నలుగురు సభ్యుల జాతీయ సెలక్షన్ కమిటీకి ఓజాను తాత్కాలిక అధిపతిగా నియమించారు. భవిష్యత్‌లో అతడినే పూర్తి స్థాయి చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ పదవి కోసం ఓజాతో పాటు మరో టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ కూడా పోటీపడుతున్నాడు. అయితే బీసీసీఐలో మెజారిటీ మద్దతు ఓజాకే ఉన్నట్లు తెలుస్తోంది. ఓజా ఇప్పటికే సెలెక్షన్ కమిటీలో సీనియర్ సభ్యుడిగా ఉన్నాడు. అతడితో పాటు శివసుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్పీ సింగ్ మిగతా సభ్యులుగా ఉన్నారు.
కాగా, మంగళవారం గౌహతిలో సెలెక్టర్ల భేటీ జరిగింది. ఈ సమావేశంలోనే ఓజాను తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి అజిత్ అగార్కర్ హాజరు కాలేదు. ఈ మీటింగ్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పాల్గొన్నాడు. ఈ సమావేశంలో త్వరలో జరుగనున్న న్యూజిలాండ్ పర్యటనకు సంబంధించిన జట్ల ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, భారత సీనియర్ క్రికెట్ జట్టు ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌లలో తొలుత వన్డేలు జరుగుతున్నాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి వన్డేలో గెలిచి, 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. గౌహతి వేదికగా ఇవాళ రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇదీ చదవండి: భారత్‌తో రెండో వన్డే.. విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ


