అగార్కర్- రోహిత్ (PC: BCCI/X)
భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీలో ఆడటం దాదాపు ఖాయమైపోయింది. విమర్శకులకు సమాధానం ఇస్తూ ఇద్దరూ ఇటీవలే పూర్తి ఫామ్‌లోకి వచ్చేశారు. మరోవైపు.. వీరికి అడ్డుపడుతున్నాడని భావించిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిపోయింది.
అగార్కర్ స్థానంలో ఓజా
అగార్కర్ స్థానంలో మరో మాజీ భారత క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదోగపన్ రమేశ్.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రో-కో విషయంలో అగార్కర్‌తో పాటు కుట్రలు పన్నిన గౌతీ.. ఇప్పుడు మాత్రం స్వలాభం కోసం వారికి భజన చేస్తున్నాడంటూ ఘాటుగా విమర్శించాడు.
గంభీర్ మాటలు నమ్మలేకపోతున్నా
ఇటీవల గంభీర్ జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘వన్డే క్రికెట్‌లో.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. తన జట్టులో విరాట్, రోహిత్‌లను కలిగి ఉండటం నిజంగా అతడి అదృష్టం. వాళ్లిద్దరు అతడికి మైదానం లోపల, వెలుపల చక్కటి సలహాలు ఇస్తూ సాయం చేస్తారు’’ అని పేర్కొన్నాడు. ఈ విషయంపై సదగోపన్ రమేశ్ తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించాడు.
‘‘గౌతం గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడంటే అస్సలు నమ్మలేకపోతున్నా. కోహ్లి, రోహిత్ తన సారథ్యంలో ఆడటం గిల్ అదృష్టమట. గంభీర్ అకస్మాత్తుగా కోహ్లి, రోహిత్‌లను ఇంతలా ప్రశంసించడాన్ని నిజంగా నమ్మలేకున్నా.
నన్ను ఇరికించి.. నువ్వు ఇపుడు భజన చేస్తున్నావా!
పక్క నుంచి అజిత్ అగార్కర్ గంభీర్‌ను చూస్తూ ఇలా అనుకుని ఉంటాడు. ‘నిన్నటి దాకా వీళ్లిద్దరిని జట్టులో ఉంచవద్దని పట్టుబట్టావు. నన్ను కూడా ఈ ఆటలో భాగం చేశావు. నా పదవీ కాలం పొడిగించుకునే దారులు మూసివేశావు.
ఇప్పుడేమో నీ పదవీ కాలం పొడిగించుకునే ప్రణాళికతో ఇలా మాట్లాడుతున్నావా? నన్ను ఇరికించి.. నువ్వు ఇపుడు భజన చేస్తున్నావా!’ అని అని అగార్కర్ మైండ్ వాయిస్ వేసుకుని ఉంటాడు’’ అని సదగోపన్ రమేశ్ ఘాటు విమర్శలు చేశాడు.
సంజూకు సెల్యూట్ కొట్టాల్సిందే
అదే విధంగా.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌ను తప్పించడం గురించి గంభీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా రమేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా సంజూ శాంసన్‌ను తప్పించడం తన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని గంభీర్ చెప్పాడు.
ఆ రాత్రి తాను నిద్రపోలేదని చెప్పాడు. నిజంగా నమ్మవచ్చు అంటారా? సరే.. ఈ ఒక్కసారికి నమ్ముదాం. ఒకవేళ అదే నిజమేతే సంజూకు సెల్యూట్ కొట్టాల్సిందే. ఎంతో మంది ఆటగాళ్ల నిద్రను నాశనం చేసి (గంభీర్‌ను ఉద్దేశించి)న వ్యక్తికి సంజూ నిద్ర లేకుండా చేశాడంటే అది గొప్ప విషయం’’ అని సదగోపన్ రమేశ్ సెటైర్లు వేశాడు.
చదవండి: కోహ్లి తప్పక పశ్చాత్తాప పడతాడు: భారత దిగ్గజ కెప్టెన్


