పురుషుల హాకీ ప్రపంచ కప్-2026లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన పూల్-డి గేమ్‌లో 2-4 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. నిక్ బందురాక్ గోల్‌తో ఇంగ్లండ్ బోణీ కొట్టినప్పటికీ.. తర్వాత భారత్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.
భారత కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడం, ఆపై దిల్ ప్రతీ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో హాఫ్‌టైమ్ సమయానికి భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకెండ్ హాఫ్ కథ తారుమారైంది. స్టువర్ట్ రష్‌మీర్, హెన్రీ క్రాఫ్ట్‌లు వరుస గోల్స్‌తో ఇంగ్లండ్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు.చివరి నిమిషాల్లో నిక్ బందురాక్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేసి ఇంగ్లండ్ విజయాన్ని (4-2) ఖాయం చేశాడు.


