PC: X
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్‌లో సత్తాచాటిన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. భారత బౌలర్లు రాణించడంతో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో గిల్ సేనకు తొలి జట్టులో 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
మూడో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండోను మొదటి ఓవర్‌లోనే పేసర్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత భారత స్నిన్నర్లు రంగంలోకి దిగారు. మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, జడేజాలతో కూడిన స్పిన్ త్రయం శ్రీలంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
సోనల్ అద్భుత సెంచరీ
ఈ సమయంలో జట్టును యువ బ్యాటర్ సోనల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. దినుష 167 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకోగా.. డిక్వెల్లా 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 146 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే డిక్వెల్లా ఔటయ్యాక లంక వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. లోయార్డర్ బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దినుష(100) కూడా సరిగ్గా సెంచరీ చేసి ఔటయ్యాడు.
భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా మూడు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. కాగా ప్రతికూల వాతవారణం కారణంగా మూడో రోజు ఆట 13 ఓవర్ల ముందే ముగిసిపోయింది. మంగళవారం నాలుగో రోజు ఆట పదిహేను నిమిషాల ముందు ఆరంభం కానుంది.


