గాలె వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఆట మొదలైన తొలి రోజు నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగలిగింది.
పడిక్కల్ భారీ శతకం
ఇందులో వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ది కీలక పాత్ర. ఈ కర్ణాటక స్టార్ మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక పడిక్కల్ భారీ శతకానికి తోడు.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)లతో ఆకట్టుకున్నారు.
వాన వల్ల అంతరాయం
మిగిలిన వారిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 32, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 39, ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ 24 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి రెండో రోజు ఆటకు పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది.
ఇక సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం మరో రెండు పరుగులు జతచేసి.. 462 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
ఎందుకిలా చేశారు?
‘‘మూడో రోజు ఉదయం ఇద్దరు టెయిలెండర్లను బ్యాటింగ్‌కు పంపాల్సిన అవసరం ఏముంది? మీరు ఎందుకిలా చేశారు?’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌లను ఎక్స్ వేదికగా దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. కాగా రెండో రోజు పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆట ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు.
అయితే, మూడోరోజు ఆట ఆరంభంలో భారత టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ బ్యాటింగ్‌కు వచ్చి.. తమ ఓవర్‌నైట్ స్కోరుకు తలా ఒక పరుగు చేశారు. కుల్దీప్ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్రసిద్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్‌గా వెనుదిరిగాడు.
బౌలర్లకు మరింత ఉపయోగకరంగా ఉండేది
నిజానికి రెండో రోజే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉంటే.. సోమవారం ఉదయమే లంక బ్యాటింగ్‌కు దిగేది. అప్పుడు పిచ్ పరిస్థితులను భారత బౌలర్లు మరింత సద్వినియోగం చేసుకునే వారని.. దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డాడు. టెయిలెండర్లతో సమయం వృథా చేయకుండా.. ముందుగానే డిక్లేర్ చేసి బాగుండేదని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలా ఉంటే.. భోజన విరామ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. భారత బౌలర్లలో సిరాజ్ ఒకటి.. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.


