Photo Credit: CA
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో కంగారూ జట్టు.. తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లా ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించగా.. సమిష్టి వైఫల్యంతో కమిన్స్ బృందం విమర్శల పాలైంది.
టాప్-3 ప్లేయర్లను మారిస్తేనే
ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందన్నాడు. ముఖ్యంగా టాప్-3 ప్లేయర్లను మారిస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలరని పేర్కొన్నాడు. ఈ మేరకు చానెల్ 7తో మాట్లాడుతూ..
హెడ్ ఓపెనర్‌గా ఎందుకు?
‘‘టెస్టుల్లో ట్రవిస్ హెడ్‌కు ఓపెనింగ్ స్థానం బెస్ట్ పొజిషన్ కానేకాదు. ఇప్పటికీ అతడు ఐదో నంబర్‌లోనే అత్యుత్తమంగా రాణించగలడని నేను నమ్ముతున్నా. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు.
ప్రస్తుత తుదిజట్టు కూర్పు వల్లే బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి ఎదురైంది. నిజానికి ఆస్ట్రేలియా క్రికెట్ అత్యంత శక్తిమంతమైనది. కానీ ఇప్పుడు ఆ స్థానం గల్లంతు అయిపోతుందేమోనని భయంగా ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.
లబుషేన్ ఇంకా జట్టులో అవసరమా?
మార్నస్ లబుషేన్ మూడో స్థానంలో చెత్తగా ఆడుతున్నాడు. గత రెండేళ్లుగా ఇదే తంతు. సామ్ కొన్‌స్టాస్ వంటి వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు?.. టాపార్డర్‌లో మ్యాట్ రెన్షా వంటి వాళ్లకు అవకాశం ఇచ్చి చూడాలి. జేక్ వెదర్లాండ్, లబుషేన్‌లను జట్టు నుంచి తొలగించినా పర్లేదు.
దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వాళ్లకు ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలి’’ అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో కమిన్స్ కెప్టెన్సీ సరిగ్గా లేదని విమర్శించాడు.
టాపార్డర్ విఫలం
డార్విన్ వేదికగా తొలి టెస్టులో ఆసీస్ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదర్లాండ్ (23) కాస్త ఫర్వాలేదనిపించినా.. వన్‌డౌన్‌లో వచ్చిన లబుషేన్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ 17, లబుషేన్ 31 పరుగులు చేయగా.. వెదర్లాండ్ డకౌట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. హెడ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో ఒకే విధంగా బౌల్డ్‌కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడగా.. ఇది రెండో విజయం. అంతకుముందు సొంతగడ్డపై 2017లో మిర్పూర్‌లో ఆసీస్‌పై బంగ్లా గెలుపొందింది.


