ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించడం ఇంగ్లండ్ క్రికెట్ చావుకొచ్చినట్లైంది. గెలిచింది బంగ్లాదేశ్, ఓడింది ఆస్ట్రేలియా అయితే ఓ చిన్నదేశం మాత్రం ఇంగ్లండ్ క్రికెట్‌ను టార్గెట్ చేసింది.
ఐస్‌లాండ్ అనే దేశానికి చెందిన క్రికెట్ బోర్డు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. గత 15 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ సాధించినన్ని టెస్ట్ విజయాలే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా సాధించిందని పేర్కొంది. ఈ వ్యంగ్యమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది.
క్రికెట్ అభిమానులు ఈ విషయం నిజమే కదా అని చర్చించుకుంటున్నారు. గత 15 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ 20 టెస్టులు ఆడి ఒక్కటే విజయం సాధిస్తే.. బంగ్లాదేశ్ మాత్రం 23 ఏళ్ల తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆసీస్‌ను మట్టికరిపించిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అన్ని వనరులు ఉండి.. ఘనమైన చరిత్ర కలిగిన ఇంగ్లండ్ కంటే కనీస సౌకర్యాలు కూడా లేని పసికూన బంగ్లాదేశ్ చాలా మెరుగని ప్రశంసిస్తున్నారు. ఇంగ్లండ్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ వేసిన సెటైర్ అభిమానులను ఆకట్టుకుంది. పనిలోపనిగా కొందరు అభిమానులు పాకిస్తాన్, శ్రీలంక జట్లపై కూడా కౌంటర్లు వేస్తున్నారు. వీటి కంటే కూడా బంగ్లాదేశ్ చాలా బెటర్ అని కీర్తిస్తున్నారు.
కాగా, డార్విన్ వేదికగా నిన్న ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 198 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్, అనంతరం 426 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 284 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని బంగ్లా జట్టు సునాయాసంగా ఛేదించి చారిత్రక విజయం సొంతం చేసుకుంది. రెండో టెస్ట్ మెక్‌కే వేదికగా ఆగస్ట్ 22 నుంచి ప్రారంభమవుతుంది.


