బాధపడొద్దు జడ్డూ.. ఇంకా చాలా టైమ్‌ ఉంది: సర్ఫరాజ్‌ | Sarfaraz Khan, Rishabh Pant Instigate Ravindra Jadeja In Galle Test | Sakshi
Sakshi News home page

బాధపడొద్దు జడ్డూ.. ఇంకా చాలా టైమ్‌ ఉంది: సర్ఫరాజ్‌

Aug 17 2026 3:26 PM | Updated on Aug 17 2026 3:48 PM

Sarfaraz Khan, Rishabh Pant Instigate Ravindra Jadeja In Galle Test

PC: X

గాలే వేదిక‌గా భార‌త్‌-శ్రీలంక మ‌ధ్య తొలి టెస్టు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. 460/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కేవలం అదనంగా రెండు పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(167) భారీ సెంచరీతో కదం తొక్కగా.. ధ్రువ్‌ జురెల్‌(51),  కేఎల్‌ రాహుల్‌(82) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మూడో రోజు ఆట తొలి సెషన్‌లో మన స్పిన్నర్ల ధాటికి లంక టాపార్డర్ కుప్పకూలింది. ముఖ్యంగా మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోనేందుకు లంక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.

ఓపెనర్ నిషాన్ ఫెర్నాండోను మొదటి ఓవర్‌లోనే పేసర్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్‌లు రంగంలోకి దిగారు. లహిరు ఉదార, చండీమాల్‌ను అద్భుతమైన బంతులతో సుతార్ బోల్తా కొట్టించాడు. కుల్దీప్ కూడా కమిందు మెండీస్‌ను ఔట్ చేసి తన వికెట్ల ఖాతాను తెరిచాడు. కానీ మరో వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను మాత్రం 19వ ఓవర్ వరకు కెప్టెన్ గిల్ ఎటాక్‌లోకి తీసుకు రాలేదు.

ఈ క్రమంలో జడేజాలో ఉత్సాహం నింపేందుకు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తమదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేశారు. ఇంకా చాలా సమయం ఉంది జడ్డూ భాయ్.. వికెట్లు అందరికి దక్కుతాయి అని సర్ఫరాజ్ అన్నాడు. 

కాసేపటికే 20 ఓవర్ వేసేందుకు జడ్డూను కెప్టెన్ తీసుకొచ్చాడు. దీంతో ఇక చూసుకోండి.."జడ్డూ భాయ్ కత్తి తిప్పడం ఖాయం" అంటూ పంత్‌ ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా పంత్‌, సర్ఫరాజ్‌ అన్నట్లు జడ్డూ కాసేపటికే దనుంజయ డిసిల్వాను అవుట్‌ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను సోనల్ దినూష(62 నాటౌట్‌), నిరోషన్ డిక్వెల్లా(76) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 134 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 58 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement