పనిమంతులే.. పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్‌ | Pakistan left red faced after forgetting penalty corner equipment in Hockey World Cup opener | Sakshi
Sakshi News home page

పనిమంతులే.. పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్‌

Aug 17 2026 12:06 PM | Updated on Aug 17 2026 12:11 PM

Pakistan left red faced after forgetting penalty corner equipment in Hockey World Cup opener

source: X

FIH పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2026ను పాకిస్తాన్‌ ఘోర పరాజయంతో ప్రారంభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన పూల్-డీ మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ విచిత్ర ఘటనతో మిగిలిన కాస్త పరువును కూడా పోగొట్టుకుంది.

ఇంగ్లండ్‌కు 17వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించిన సమయంలో పాక్‌ ఆటగాళ్ల వద్ద ఉండాల్సిన పెనాల్టీ కార్నర్ రక్షణ పరికరాలు (పెనాల్టీ కార్నర్‌ కిట్‌) అందుబాటులో లేవు. దీంతో ఓ ఆటగాడు మైదానం నుంచి బయటకు వెళ్లి పరికరాలతో కూడిన బ్యాగ్‌ను తీసుకురావాల్సి వచ్చింది. ఈ కారణంగా మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.

ఈ ఆలస్యంపై అంపైర్లు చర్యలు తీసుకున్నారు. పాక్‌ కెప్టెన్ అబూ బకర్‌కు గ్రీన్ కార్డ్ చూపించి రెండు నిమిషాల పాటు మైదానం నుంచి బయటకు పంపారు.

ఈ ఘటనపై పాక్‌ మాజీ కెప్టెన్ సల్మాన్ అక్బర్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచకప్‌ వంటి అత్యున్నత అంతర్జాతీయ వేదికపై పెనాల్టీ కార్నర్‌కు అవసరమైన ప్రాథమిక రక్షణ పరికరాలను మర్చిపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

“ప్రపంచకప్‌ అత్యున్నత స్థాయి ప్రొఫెషనలిజాన్ని కోరుకుంటుంది. ఇలాంటి ఘటనలు జట్టు ఎంతవరకు సిద్ధంగా ఉందనే ప్రశ్నలను లేవనెత్తుతాయి” అని సల్మాన్ అక్బర్ విమర్శించారు.

అక్బర్‌ విమర్శలను అటుంచితే, పెనాల్టీ కిట్‌ లేకుండా ప్రపంచకప్‌ మ్యాచ్‌ బరిలోకి దిగిన పాక్‌ జట్టుపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గొప్ప పనిమంతులే అంటూ స్వదేశ అభిమానులే వారిని విమర్శిస్తున్నారు. ఇంత అ.జాగ్రత్తగా ఎలా ఉంటారని అంటున్నారు. 

మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తొలి అర్ధభాగంలోనే ఆధిపత్యం ప్రదర్శించింది. పాక్‌ ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ చివరకు 4-1తో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది.

పాక్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 17న వేల్స్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 19న భారత్‌తో కీలక పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లోనే భారీ ఓటమి ఎదురుకావడంతో పాక్‌కు తదుపరి రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement