ఆ నలుగురికే కాదు.. అందరికీ తెలియాల్సిందే: గావస్కర్‌ | Sunil Gavaskar Urges BCCI To Make IPL Player Trades More Transparent Amid Hardik Pandya Trade Buzz, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఆ నలుగురికే కాదు.. అందరికీ తెలియాల్సిందే: గావస్కర్‌

Aug 17 2026 2:45 PM | Updated on Aug 17 2026 3:34 PM

BCCI Asked For Transparency During High Profile IPL Trade Deals

ఐపీఎల్‌ 2027 వేలానికి ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టు మారబోతున్నాడే ప్రచారం జోరుగా సాగుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తప్ప.. మిగిలిన ఫ్రాంఛైజీలన్నీ హార్దిక్‌ కోసం పోటీలో ఉన్నాయని ఆకాశ్‌ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అంటున్నారు.

అయితే, ముంబై యాజమాన్యం మాత్రం ఇంతవరకు హార్దిక్‌ ట్రేడింగ్‌ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ లేదంటే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఈ ఆల్‌రౌండర్‌ చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి కీలక విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్‌ ట్రేడింగ్‌ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించాడు. ‘‘వేలానికి ముందు ఆటగాళ్లు ఒక ఫ్రాంఛైజీ నుంచి మరో ఫ్రాంఛైజీకి మారే అంశం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ విండో పూర్తి కావడానికి ఇంకా సమయం ఉంది. సమయం వచ్చినపుడు ఏ ఆటగాడు ఏ జట్టు నుంచి మరే జట్టుకు మారుతున్నాడో ఫ్రాంఛైజీలు అధికారికంగా ప్రకటిస్తున్నాయి. కానీ ఎంతకు ట్రేడింగ్‌ (ధర) జరిగిందన్న విషయం మాత్రం బహిర్గతం కావడం లేదు.

సదరు ఆటగాడు, బీసీసీఐ, రెండు ఫ్రాంఛైజీల వద్ద మాత్రమే ఆ సమాచారం ఉంటోంది. అలాంటపుడు ఫ్రాంఛైజీలు తమ సాలరీ క్యాప్‌నకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నాయా? లేదంటే ఉల్లంఘిస్తున్నాయా? అన్న విషయం ఎలా తెలుస్తుంది. అందుకే ట్రేడింగ్‌ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి. ఆ నంబర్లను కూడా బహిరంగంగా ప్రకటించాలి.

ఫ్రాంఛైజీలు జవాబుదారీతనం పాటించేలా చూడాలి. ప్రపంచంలోనే ఐపీఎల్‌ అత్యంత గొప్ప లీగ్‌గా కొనసాగుతోంది. ఇలాంటి టోర్నీలో పారదర్శకతకు పెద్దపీట వేయకపోతే.. విమర్శలు వచ్చే అవకాశం ఉంది’’ అని సునిల్‌ గావస్కర్‌ మిడ్‌-డేకు రాసిన కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement