టీమిండియాపై వీరోచిత సెంచరీ.. ఎవరీ సోనల్ దినూష? | Who is Sonal Dinusha? All you need to know about Sri Lanka star who scored century in SL vs IND 1st Test | Sakshi
Sakshi News home page

IND vs SL: టీమిండియాపై వీరోచిత సెంచరీ.. ఎవరీ సోనల్ దినూష?

Aug 17 2026 9:30 PM | Updated on Aug 17 2026 9:39 PM

Who is Sonal Dinusha? All you need to know about Sri Lanka star who scored century in SL vs IND 1st Test

గాలే వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక యువ బ్యాట‌ర్ సోనల్ దినూష అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వచ్చిన దినుష తన వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 

ఈ యంగ్ బ్యాటర్‌ డిక్వెల్లతో కలిసి 6వ వికెట్‌కు 146 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 25 ఏళ్ల దినుషకు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. ఈ క్రమంలో సోనాల్ దినూషకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

17 ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌ ఎంట్రీ
👉సోనాల్ దినూష కేవలం 17 ఏళ్లకే కొలంబో క్రికెట్ క్లబ్  తరఫున ఫస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2018లో అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో సోనాల్  45.09 సగటుతో 3,698 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా దినుష బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా అతడు ఫస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 133 వికెట్లు పడగొట్టాడు.

👉కొలంబో క్రికెట్ క్లబ్ తరఫున మేజర్ లీగ్ టోర్నీలో దినూష ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా, ఓపెనింగ్ బౌలర్‌గా బరిలోకి దిగి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అత‌డు అద‌ర‌గొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

👉ఆతర్వాత సౌతాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌-2026లో శ్రీలంక జట్టులో దినుష భాగమయ్యాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండర్‌గా తన సేవలను అందించాడు. లోయార్డర్‌లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడం అతడి స్పెషాలిటీ.

👉దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుండ‌డంతో గ‌తేడాది జాన్‌లో శ్రీలంక జాతీయ జ‌ట్టు సెల‌క్ట‌ర్ల నుంచి దినూష‌కు పిలుపువ‌చ్చింది. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ త‌ర్వాత వెస్టిండీస్ టూర్‌లో కూడా భాగ‌మ‌య్యాడు. ఇప్పటివరకు కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడిన దినుష.. 57.2 సగటుతో 286 పరుగులు చేశాడు. అదేవిధంగా 6 వికెట్లు సాధించాడు.

👉సోనాల్ దినూష ప్రతిష్టాత్మక మహానామ కాలేజీలో విధ్య‌ను అభ్య‌సించాడు. ఈ కాలేజీకి శ్రీలంక క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ ప్ర‌త్యేకమైన స్ధాన‌ముంది.  ఈ కళశాల‌లో చ‌దివిన చాలా మంది విద్యార్థులు శ్రీలంక జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించారు.ప్రస్తుత లంక టెస్ట్ కెప్టెన్ ధనంజయ డి సిల్వా కూడా ఈ కాలేజీకి చెందినవాడే కావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement