source: BCCI X
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 124 పరుగుల తేడాతో చిత్తు చేసి, అక్టోబర్ 3న జరిగే (ఉదయం 10 గంటలకు ప్రారంభం) తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత్ తమ చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ స్వర్ణ పతకం సాధిస్తుంది. ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఇషాన్ కిషన్ (80 నాటౌట్) చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ (38) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తలో 7, శ్రేయస్ అయ్యర్ 13, అక్షర్ పటేల్ 8, తిలక్ వర్మ 2, శివమ్ దూబే 3, వాషింగ్టన్ సుందర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు.
45 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
170 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ తలో 2, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీయడంతో శ్రీలంక 9.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్ కాగా.. నువనిదు ఫెర్నాండో (15) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. కఠినమైన పిచ్‌పై భారత బౌలర్లను ఎదుర్కోవడం లంక ఆటగాళ్ల వల్ల కాలేదు. ఆ జట్టు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.

కాంస్యం కోసం బంగ్లాదేశ్, శ్రీలంక పోటీ
సెమీఫైనల్స్‌లో ఓడిన బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు అక్టోబర్ 3నే జరిగే పోటీలో కాంస్య పతకం కోసం పోటీపడతాయి. ఆ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆ రోజు ఉదయం 5:30 గంటలకు ప్రారంభవుతుంది.
ఇదీ చదవండి: Asian Games Men's Cricket: ఫైనల్స్‌కు పాకిస్తాన్


