నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌ను చిత్తు చేసి ఫైనల్లో భారత్‌ | Asian Games 2026: India Beat Pakistan In Men's Hockey Semi Final | Sakshi
Sakshi News home page

నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌ను చిత్తు చేసి ఫైనల్లో భారత్‌

Oct 1 2026 2:59 PM | Updated on Oct 1 2026 3:29 PM

Asian Games 2026: India Beat Pakistan In Men's Hockey Semi Final

PC: Hockey India X

ఆసియా క్రీడలు-2026 టోర్నీలో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. పాకిస్తాన్‌తో గురువారం నాటి సెమీ ఫైనల్లో ఆఖరి నిమిషంలో గోల్‌ కొట్టి ఫైనల్‌కు దూసువెళ్లింది. దాయాదిని 4-3 గోల్స్‌ తేడాతో చిత్తు చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. స్వర్ణ పతక ఆశల్ని సజీవం చేసుకుంది. 

ఆదిలో ఆధిపత్యం
జపాన్‌ వేదికగా పాక్‌తో సెమీస్‌లో... కెప్టెన్‌, పెనాల్టీ కార్నర్‌ స్పెషలిస్టు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ తొలి గోల్‌ కొట్టడంతో భారత్‌ ఖాతా తెరిచింది. హర్మన్‌ మరోసారి విజృంభించి తొలి క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు తీసుకువెళ్లాడు.

మారిన సీన్‌
ఇక సుఖ్‌జీత్‌ సింగ్‌ మూడో గోల్‌ కొట్టగా భారత్‌ 3-0తో ముందంజ వేసింది. అయితే, ఆ తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ అబూ మహమూద్‌ గోల్‌ కొట్టి జట్టును తిరిగి పోటీలో నిలిపాడు. దీంతో రెండో అర్ధ భాగం మొదలయ్యేసరికి స్కోరు 3-1గా మారింది. ఆ తర్వాత హనన్‌ షాహిద్‌ భారత డిఫెన్స్‌ను బోల్తా కొట్టించి తెలివిగా గోల్‌ కొట్టాడు.

తీవ్రమైన ఒత్తిడి
అనంతరం వహీద్‌ రాణా కూడా గోల్‌ కొట్టగా స్కోరు 3-3తో సమమైంది. దీంతో భారత శిబిరం తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ క్రమంలో గోల్‌ కీపర్‌ మోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో సూరజ్‌ కర్కేరాను తీసుకువచ్చింది. ఇలాంటి దశలో పాక్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని గోల్‌గా మలచలేకపోయింది. దీంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది.

ఆఖరి నిమిషంలో అద్భుతం 
ఈ క్రమంలో ఆటకు ఇంకా నలభై సెకండ్ల వ్యవధి మాత్రమే ఉన్న సమయంలో అభిషేక్‌ అనూహ్య రీతిలో గోల్‌ కొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో భారత్‌ పాక్‌ను 4-3తో ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

ఇదిలా ఉంటే.. భారత మహిళా హాకీ జట్టు కూడా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో ఇలా ఒకే ఎడిషన్‌లో భారత హాకీ మహిళల, పురుషుల జట్లు ఫైనల్‌కు చేరడం 1998 తర్వాత ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement