'అక్త‌ర్ రికార్డు బ‌ద్ద‌లు కొడుతా'.. భారత రైజింగ్ స్టార్ శ‌ప‌థం | India Rising Star Ashok Sharma-Vows-Will-Break-Shoaib-Akhtar World Record | Sakshi
Sakshi News home page

'అక్త‌ర్ రికార్డు బ‌ద్ద‌లు కొడుతా'.. భారత రైజింగ్ స్టార్ శ‌ప‌థం

Jul 8 2026 6:25 PM | Updated on Jul 8 2026 7:48 PM

India Rising Star Ashok Sharma-Vows-Will-Break-Shoaib-Akhtar World Record

గుజ‌రాత్ టైటాన్స్ పేస‌ర్ అశోక్ శ‌ర్మ పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ప్ర‌పంచ రికార్డును బ‌ద్దలు కొడుతానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 161.3 కిమీవేగంతో అక్త‌ర్ విసిరిన బంతి ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌కుండా ఉంది. తాజాగా అక్త‌ర్ రికార్డును తాను బ‌ద్ద‌లు కొడుతానంటూ అశోక్ శ‌ర్మ శ‌ప‌థం చేయ‌డం గ‌మ‌నార్హం. 

ఏదోఒక రోజు అక్త‌ర్ రికార్డును బ‌ద్దలు కొట్టే స‌త్తా త‌న‌కు ఉంద‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌ఫున ఆడిన అశోక్ శ‌ర్మ ఒక మ్యాచ్‌లో 154.2 కిలోమీట‌ర్ వేగంతో (గంట‌కు 95.8 మైళ్ల వేగం) బంతి విసిరి ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్ డెలివ‌రీతో రికార్డు సృష్టించాడు. అంత‌క‌ముందు స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సీజ‌న్‌లో 22 వికెట్లు తీయ‌డ‌మే గాక ప్ర‌తీ మ్యాచ్‌లో దాదాపు 150 కిలోమీట‌ర్ల వేగంతో స్థిరంగా బంతులు వేయ‌డం విశేషం. 

ఒక మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అశోక్ శ‌ర్మ మాట్లాడుతూ.. ‘ఏదో ఒక‌రోజు అక్త‌ర్ ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాల‌నే సంక‌ల్పంతోనే ఉన్నా. బౌలింగ్ వేగం విష‌యంలో మాత్రం ఎన్నటికీ రాజీప‌డ‌ను. నా దృష్టి ఎప్పుడు బౌలింగ్‌ను మెరుగుప‌రుచుకోవ‌డంపైనే ఉంటుంది. 

అంతా స‌వ్యంగా సాగితే, బ‌హుశా ఒక‌రోజు అక్త‌ర్ నెల‌కొల్పిన 161 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకోగ‌లుగుతానేమో. ఈ క్ర‌మంలో న‌న్ను నేను మెరుగుప‌ర‌చుకునేందుకు మ‌రింత క‌ష్ట‌ప‌డుతాను. అయితే నా బౌలింగ్‌ను మెరుగుపర‌చుకునే క్ర‌మంలో ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండ‌డాన్ని ఇష్ట‌ప‌డుతాను.’ అని చెప్పుకొచ్చాడు.

ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికైన అశోక్ శ‌ర్మ‌కు తుది జ‌ట్టులో అవ‌కాశం ల‌భిస్తుందా? లేదా? అనేది ప‌క్క‌న‌బెడితే ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌నతో పాటు స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే ఇండియా-ఏ జ‌ట్టు త‌ర‌ఫున అరంగేట్రం చేసినప్పటికీ పెద్ద‌గా రాణించ‌లేదు. ఒక వ‌న్డే మ్యాచ్‌లో 75 ప‌రుగులిచ్చి ఒక వికెట్ మాత్ర‌మే తీశాడు. 

ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌ఫున ఆరు మ్యాచ్‌లాడిన అశోక్ శ‌ర్మ ఆరు వికెట్లు మాత్ర‌మే తీశాడు. అయితే ప్రతీ జ‌ట్టుకు పేస్ బౌల‌ర్లు ఆస్తిలాంటి వారు. జ‌మ్మూ క‌శ్మీర్ సంచ‌ల‌నం ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. 2023లో వ‌న్డేలు, టీ20ల్లో ఆడిన‌ప్ప‌టికీ ఎక్కువకాలం జ‌ట్టులో కొన‌సాగ‌లేక‌పోయాడు. త‌న వేగం బ‌ల‌మైన‌ప్ప‌టికీ దానిని నిల‌క‌డ‌గా కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. 

దీనికి తోడు త‌ర‌చూ గాయాల బారీన ప‌డ‌డం కూడా అత‌డిని జ‌ట్టుకు దూరం చేసింది. మ‌రి అశోక్ శ‌ర్మ ఏ మేర‌కు రాణిస్తాడ‌నేది చూడాలి. ఒక‌వేళ టీమిండియాలో అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటే అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రానా, బుమ్రా వంటి స్టార్ పేస్ల‌ర‌కు ప‌ని భారాన్ని త‌గ్గించే క్ర‌మంలో అశోక్ శ‌ర్మ ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌డు. బుమ్రా ఒక్క‌డే టీమిండియా పేస్ బారాన్ని మోస్తున్న త‌రుణంలో అశోక్ శ‌ర్మ లాంటి యువ బౌల‌ర్ల అవ‌స‌రం టీమిండియాకు ఎంతో ఉంది.

చెక్కుచెదరని అక్త‌ర్ రికార్డు
2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయ‌బ్ అక్త‌ర్ అత్యంత ఫాస్టెస్ట్ బంతిని విసిరాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో నిక్ నైట్‌కు (గంట‌కు 161.3 కిలోమీట‌ర్‌ వేగంతో) బంతిని విసిరాడు. గంట‌కు 100 మైళ్ల వేగంతో విసిరడంతో అక్త‌ర్ పేరు క్రికెట్ పుస్త‌కాల్లో నిలిచిపోయింది. ఇప్ప‌టికీ  ఆ రికార్డు చెక్కుచెద‌ర‌కుండా ఉంది. 

ఆసీస్ స్పీడ‌స్ట‌ర్లు బ్రెట్ లీ, షాన్ టైట్‌లు అక్త‌ర్ రికార్డుకు స‌మీప దూరంలో నిలిచిపోయారు. బ్రెట్ లీ ఒక మ్యాచ్‌లో గంట‌కు 161.1 కిలోమీట‌ర్ల వేగం న‌మోదు చేయ‌గా, షాన్ టైట్ రెండుసార్లు (2005, 2010) అక్త‌ర్ రికార్డుకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాడు. 2005లో గంట‌కు 160.7 కిలోమీట‌ర్ల వేగంతో విస‌రగా, 2010లో గంట‌కు 161.1 కిలోమీట‌ర్ వేగంతో విసిరాడు.  

 

Read: ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్‌ ఫైనల్స్‌ షెడ్యూల్‌ ఇదే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement