అర కిలోమీటర్ దూరంలో వాష్‌రూమ్‌లు
ఆసియా క్రీడలపై క్రికెట్ బోర్డుల ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా... వీటిలో ఐదు టెస్టు క్రికెట్ దేశాలు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. సహజంగానే అంతర్జాతీయ టోర్నీలు, సిరీస్‌లలో ఈ టీమ్‌ల వసతి, ఇతర సౌకర్యాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ క్రికెట్ జట్లకు కొత్త సమస్య వచ్చి పడింది. ఆసియా క్రీడల కోసం క్రికెటర్లకు చేస్తున్న ఏర్పాట్లు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ఆయా దేశాల క్రికెట్ బోర్డును అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక అయిన కరోగీ పార్క్‌లో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఎలాంటి డ్రెస్సింగ్‌రూమ్‌లు లేవు. బౌండరీ బయట ఏర్పాటు చేసే టెంట్‌లోనే మ్యాచ్ సాగినంత సేపు క్రికెటర్లు ఉండాల్సిందే. పైగా కనీసం 500 మీటర్లు నడిస్తే గానీ వాష్‌రూమ్ సౌకర్యం లేదు! మైదానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఆటగాళ్లకు వసతి ఏర్పాటు చేశారు. ఇక్కడి గదులు మరీ చిన్నవిగా ఉన్నాయని కూడా ఫిర్యాదు వచ్చింది.
‘లగేజీ, కిట్‌బ్యాగ్‌లతో సహా చూస్తే ఇద్దరు క్రికెటర్లు కలిసి ఉండలేనంత చిన్నవిగా రూమ్స్ ఉన్నాయి. ఒక ప్లేయర్ తన కిట్‌బ్యాగ్ తెరిస్తే మరో ఆటగాడు నిలబడేంత స్థలం కూడా లేదు’ అని ఒక బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై ఆసియా క్రీడల నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించాలని బోర్డులు భావిస్తున్నాయి. ఇలాగే ఉంటే భారత్ తరఫున ద్వితీయ శ్రేణి జట్టును పంపే ఆలోచనతో బీసీసీఐ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు జట్టును మార్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆసియా క్రీడల కోసం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా పూర్తి స్థాయి టి20 టీమ్‌ను బరిలోకి దింపుతోంది.


