ప్రత్యేక ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యల నమోదు, పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్ ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎస్‌సీఎంఎస్)ను అందుబాటులోకి తెచి్చంది. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ సర్వీసెస్ విభాగం ద్వారా ఈ వ్యవస్థను వినియోగించుకోవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫిర్యాదులను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, సకాలంలో పర్యవేక్షించడమే ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
ఫిర్యాదు చేయదలచిన వ్యక్తి తమ మొబైల్ ఫోన్ నంబర్‌తో లాగిన్ కావాలని, రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన అనంతరం వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుందని, ఈ ఓటీపీ నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు పంపవచ్చని చెప్పారు. ఈ వ్యవస్థలో గ్రీవెన్స్ ట్రాకింగ్ మెకానిజం కూడా అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదుదారులు తమ ఫోన్ నంబర్ లేదా గ్రీవెన్స్ ఐడీ ద్వారా ఫిర్యాదు ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు.


