ఏడాదిన్నరలోగా భూసర్వే పూర్తి | Ponguleti Srinivasa Reddy review meeting at Adilabad district | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నరలోగా భూసర్వే పూర్తి

Oct 6 2026 12:42 AM | Updated on Oct 6 2026 12:42 AM

Ponguleti Srinivasa Reddy review meeting at Adilabad district

మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో జూపల్లి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి

నిర్మల్‌: రాష్ట్రంలో భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో చేపట్టిన సర్వేను ఏడాదిన్నరలోగా ప్రతీగ్రామంలో పూర్తిచేసే దిశగా చర్యలు చేపడుతున్నామని, ప్రతీ భూ కమతానికి భూధార్‌ నంబర్‌ కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇన్‌చార్జ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నిర్మల్‌ జిల్లాకేంద్రంలో సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ కలెక్టర్లు, అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఎప్పుడో 125 ఏళ్ల క్రితం భూసర్వే జరిగిందని, ఇప్పటికీ భూ సంబంధిత వివాదాలు కొనసాగుతున్నాయన్నారు. 

భూముల సమగ్ర సర్వేతో భవిష్యత్‌లో ఎలాంటి భూ వివాదాలు తలెత్తవని చెప్పారు. ఇందుకు సంబంధించిన సర్వే పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించి, తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అటవీ సంబంధిత సమస్యల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోకుండా, పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని సూచించారు.

అవసరమైతే ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై మంత్రి సీరియస్‌ అయ్యారు. సమావేశంలో చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ లోకేశ్‌కుమార్, రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్లు, స్టాంపులు) ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ.గౌతమ్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీమ్‌ జిల్లాల కలెక్టర్లు భవేశ్‌ మిశ్రా, రాజర్షిషా, హరిత, ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్, ముధోల్, బోథ్, ఆసిఫాబాద్, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, పవార్‌ రామారావు పటేల్, అనిల్‌ జాదవ్, కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, ఐటీడీఏ పీవో మంద మకరందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement