నేడు పాకిస్తాన్‌తో భారత్‌ ఢీ | India to face Pakistan in Womens Asia Cup T20 tournament today | Sakshi
Sakshi News home page

నేడు పాకిస్తాన్‌తో భారత్‌ ఢీ

Sep 5 2026 1:28 AM | Updated on Sep 5 2026 1:28 AM

India to face Pakistan in Womens Asia Cup T20 tournament today

హ్యాట్రిక్‌పై గురి

మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీ

రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

దుబాయ్‌: వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు ఆసియాకప్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ‘హ్యాట్రిక్‌’పై గురి పెట్టింది. ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకున్న టీమిండియా నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా సాగుతున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు దాయాదిపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమిండియా 4 పాయింట్లతో సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా... పాకిస్తాన్‌ ఆడిన ఒక్క మ్యాచ్‌లో నెగ్గి 2 పాయింట్లతో సెమీఫైనల్‌ రేసులో ఉంది. 

ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడింట చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... పాకిస్తాన్‌తో పోరులోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా... పాకిస్తాన్‌ కంటే టీమిండియా ఎంతో మెరుగ్గా ఉంది. మరోవైపు భారత్‌ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించాలని ఫాతిమా సనా సారథ్యంలోని పాకిస్తాన్‌ జట్టుపట్టుదలగా ఉంది. 

ఓపెనింగ్‌ అదుర్స్‌... 
ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనుంది. హాంకాంగ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో రికార్డుల దుమ్ముదులిపిన స్మృతి అదే జోరు కొనసాగిస్తే పాకిస్తాన్‌కు తిప్పలు తప్పకపోవచ్చు. గత మ్యాచ్‌ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు... భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా నిలిచిన స్మృతి... పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం. 

మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ కూడా మంచి టచ్‌లో ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న ప్రతీక రావల్‌ మరింత భారీ స్కోర్లు చేయాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురు తప్ప మిగిలినవాళ్లు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడకపోవడం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. 

ఇక దీప్తి శర్మతో పాటు ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం పాక్‌ ప్లేయర్లకు శక్తికి మించిన పనే కానుంది.శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో యూఏఈ 6 వికెట్ల తేడాతో ఇండోనేసియాను చిత్తు చేసింది. ఇండోనేసియా 19.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్ప కూలింది. యూఏఈ 13.1 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

17 భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు 17 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో భారత జట్టు... 3 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ జట్టు గెలుపొందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement