షెన్‌జెన్: ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పైచేయి సాధించింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 16–21, 21–18తో కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసెన్ (డెన్మార్క్) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో భారత జంట జోరు కనబర్చగా... రెండో గేమ్‌లో డెన్మార్క్ జోడీ పుంజుకుంది.
నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో భారత జంట 5–9తో, 15–17తో వెనుకబడింది. కానీ భారత జోడీ ఒక్కసారిగా చెలరేగి వరుసగా 5 పాయింట్లు గెలిచి 20–17తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత డెన్మార్క్ జంటకు ఒక పాయింట్ కోల్పోయిన సాత్విక్–చిరాగ్ వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం మూడో టోర్నీలో సెమీఫైనల్ చేరుకుంది.
థాయ్‌లాండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్... సింగపూర్ ఓపెన్‌లో టైటిల్ సాధించారు. నేడు జరిగే సెమీఫైనల్లో అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత సీనియర్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 16–21, 16–21తో ఓడిపోయాడు.


