శ్రీకాంత్‌ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర | Kidambi Srikanth Stuns Victor Lai In China Masters Reaches QF | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర

Sep 3 2026 7:12 PM | Updated on Sep 3 2026 7:58 PM

Kidambi Srikanth Stuns Victor Lai In China Masters Reaches QF

శ్రీకాంత్‌ (PC: Badminton Photo)

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ అద్భుత విజయం సాధించాడు. చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లాడు. షెన్‌జెన్‌ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ విక్టర్‌ లాయ్‌ (కెనడా)కు శ్రీకాంత్‌ ఊహించని షాకిచ్చాడు.

నలభై మూడు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో విక్టర్‌ను 21-18, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. తద్వారా బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 750 లేదా అంతకంటే హయ్యర్‌ ఈవెంట్లో దాదాపు 1175 రోజుల తర్వాత శ్రీకాంత్‌ తొలిసారి క్వార్టర్స్‌లో ఆడే ఘనత సాధించాడు. కాగా శ్రీకాంత్‌ చివరగా 2023 ఇండోనేషియా ఓపెన్‌ (సూపర్‌ 1000 ఈవెంట్‌)లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు.

ఇక చైనా మాస్టర్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో 33 ఏళ్ల కిడాంబి శ్రీకాంత్‌ హాంగ్‌కాంగ్‌కు చెందిన లీ చుయెక్‌ యీయూను శుక్రవారం ఎదుర్కొంటాడు. కాగా ఒకప్పటి ప్రపంచ నంబర్‌ వన్‌ శ్రీకాంత్‌ ప్రస్తుతం 34వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే.. మెన్స్‌ డబుల్స్‌ ఈవెంట్లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి- చిరాగ్‌ శెట్టి కూడా క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం నాటి మ్యాచ్‌లో ఫ్రెంచ్‌ సోదరులు క్రిస్టో, టోమా జూనియర్‌ పొపోవ్‌లపై 21-15, 22-24, 21-9 తేడాతో వీరు విజయం సాధించారు. 

మరోవైపు.. మహిళల సింగిల్స్‌ విభాగంలో తన్వీ శర్మ 66 నిమిషాల పాటు జపాన్‌ వరల్డ్‌ నంబర్‌ 9 తొమొక మియాజాకితో పోరాడి (17-21, 21-18, 16-21) ఓటమిపాలైంది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల- తనీషా క్రాస్టో కూడా ఓటమిపాలయ్యారు. చైనీస్‌ తైపీ జోడీ చేతిలో ఓడి ఇంటిబాటపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement