షెన్‌జెన్: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఉన్నతి హుడా... పురుషుల డబుల్స్‌లో హరిహరన్–అర్జున్ తొలి రౌండ్‌ను దాటడంలో విఫలమయ్యారు. ప్రపంచ 12వ ర్యాంకర్ కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఉన్నతి 10–21, 18–21తో ఓడిపోయింది. చెన్ బో యాంగ్–లియు యి (చైనా)లతో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 8–11తో వెనుకబడిన దశలో గాయం కారణంగా హరిహరన్–అర్జున్ మ్యాచ్ నుంచి వైదొలిగారు.
నేడు భారత క్రీడాకారులు ఏడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో చి యు జెన్ (చైనీస్ తైపీ)తో కిడాంబి శ్రీకాంత్, విక్టర్ లాయ్ (కెనడా)తో లక్ష్య సేన్... మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో కలోయానా నల్బన్‌తోవా (బల్గేరియా)తో దేవిక సిహాగ్, అమేలియా షుల్జ్ (డెన్మార్క్)తో తన్వీ శర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో జునైదీ ఆరిఫ్–కాంగ్ ఖాయ్ జింగ్ (మలేసియా)లతో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో వు గువాన్ జున్–లీ చియా సిన్ (చైనీస్ తైపీ)లతో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్... టోన్‌కిడ్ సహెంగ్–టాన్‌రుగ్ సహెంగ్ (థాయ్‌లాండ్)లతో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల పోటీపడతారు.


