నాలుగేళ్ల కనిష్ఠానికి హైదరాబాద్‌ హౌసింగ్ సేల్స్! | Hyderabad Housing Sales Hit 4-Year Low Price Surge High Inventory Slow Market | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల కనిష్ఠానికి హైదరాబాద్‌ హౌసింగ్ సేల్స్!

Sep 14 2026 12:23 PM | Updated on Sep 14 2026 12:33 PM

Hyderabad Housing Sales Hit 4-Year Low Price Surge High Inventory Slow Market

రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా ఉన్న భాగ్యనగరంలో గృహ విక్రయాల వేగం మందగించింది. క్రెడాయ్ హైదరాబాద్ - క్రె మ్యాట్రిక్స్ (CRE Matrix) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (హెచ్‌1 2026 ఆర్థిక సంవత్సరం) నగరంలో ఇళ్ల విక్రయాలు 13 శాతం క్షీణించి 26,068 యూనిట్లకు పడిపోయాయి. గత 4.5 ఏళ్ల కాలంలో (2022 తర్వాత) ఇదే అత్యల్ప అర్ధవార్షిక విక్రయాల సంఖ్య కావడం గమనార్హం.

ప్రైమ్ మార్కెట్‌ రూ.52,913 కోట్లు

విక్రయాల సంఖ్య తగ్గినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగలేదు. సగటు ఇంటి విక్రయ ధర గత ఏడాది రూ.1.85 కోట్లుగా ఉండగా, ఈసారి 10 శాతం పెరిగి రూ.2.03 కోట్లకు చేరింది. సగటు ఇంటి పరిమాణం 2,300 చదరపు అడుగులుగా ఉంది. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో రూ.52,913 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగాయి. బెంగళూరు, ముంబైల తర్వాత దేశంలోనే అత్యధిక విక్రయ విలువ కలిగిన మూడో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా హైదరాబాద్ నిలిచింది.

కొనుగోళ్లు తగ్గడానికి కారణాలేంటి?

  • ఐటీ రంగానికి చెందిన అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐల నుంచి వస్తున్న పెట్టుబడులు తగ్గాయి. ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, వీసా నిబంధనలు కఠినతరం కావడం వల్ల ప్రీమియం గృహ విభాగానికి ఆదరణ తగ్గింది.

  • రూ.2 కోట్లకు పైబడిన ఇళ్లను కొనడానికి వేతన జీవులు వెనుకాడడమే కాకుండా అద్దె ఇళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు.

  • గల్ఫ్ యుద్ధ వాతావరణం, నిర్మాణ వ్యయాలు పెరగడం, సోషల్ మీడియాలో ధరల పెరుగుదలపై ప్రతికూల ప్రచారాలు సైతం కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపాయి.

1.42 లక్షలకు చేరిన నిల్వ ఇళ్లు

మరొకవైపు డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను భారీగా ప్రారంభించడంతో డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగింది. ఈ ప్రథమార్ధంలో రికార్డు స్థాయిలో 49,656 కొత్త ఇళ్లు లాంచ్ కాగా (37% పెరుగుదల), అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 21% పెరిగి 1,42,722 యూనిట్లకు చేరింది. వీటిని విక్రయించడానికి దాదాపు 29 నెలల సమయం పడుతుందని అంచనా. అయితే, ఈ అమ్ముడుపోని నిల్వలో కేవలం 20 శాతం (దాదాపు 30,000 ఇళ్లు) మాత్రమే తక్షణమే నివాసానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి 2027-2029 లేదా ఆ తర్వాత పూర్తవుతాయని నివేదిక వెల్లడించింది. రాబోయే పండుగల సీజన్‌లో మార్కెట్ పుంజుకుంటుందని బిల్డర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పండగ పూట.. బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement