పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు.. | akshaya tritiya 2026 gold price hike buying trends Then vs Now | Sakshi
Sakshi News home page

పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..

Apr 11 2026 2:27 PM | Updated on Apr 11 2026 2:40 PM

akshaya tritiya 2026 gold price hike buying trends Then vs Now

ఆశలు అక్షయం కావాలని కోరుకుంటూ భారతీయులు జరుపుకునే పవిత్ర పండుగ అక్షయ తృతీయ. ఈ ప్రత్యేక సందర్భంలో పసిడి కొనుగోలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది కూడా పసిడి కొనుగోళ్లకు జనం సిద్ధమవుతున్నప్పటికీ, ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుడి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధరల్లో వచ్చిన భారీ మార్పు ఇప్పుడు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.

ధరల వ్యత్యాసం
2025 అక్షయ తృతీయ నాటి ధరలతో పోలిస్తే, ఈ ఏడాది (2026) బులియన్ మార్కెట్‌లో పెను మార్పులు సంభవించాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.96,000 నుండి రూ.97,000 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధరకు కేవలం 6 నుండి 6.5 గ్రాములు మాత్రమే వస్తోంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోలుదారుల శక్తి 30-40% వరకు క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

దేశంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,52,840 లుగా (ఏప్రిల్‌ 11 నాటికి) ఉంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,40,100 లుగా ఉంది.

ఎందుకీ పరుగు?
బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సురక్షిత ఆస్తి'గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్ (ETF)లపై ఆసక్తి పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి.

మారిన వినియోగదారుల తీరు
ధరలు భారమైనా సెంటిమెంట్‌ను వదులుకోని భారతీయులు, తమ కొనుగోలు పద్ధతులను మార్చుకుంటున్నారు. భారీ ఆభరణాల కంటే తక్కువ బరువుతో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ కంటే పెట్టుబడి దృక్పథంతో బంగారు నాణేలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా నగదు ఖర్చు చేసే కంటే, ఇంట్లో ఉన్న పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకునే 'ఎక్స్ఛేంజ్ స్కీంల' వైపు జనం మొగ్గు చూపుతున్నారు.

వ్యాపారుల వ్యూహాలు
కస్టమర్లను ఆకర్షించడానికి జ్యువెలరీ షాపులు కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, ముందస్తు బుకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఒక్కొక్కరు కొనే బంగారం పరిమాణం తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement