గనిలో ఘోరం: ఐదుగురు మృతి.. 15 మంది గల్లంతు | At Least 5 Dead 15 Missing in Myanmar Jade Mine Landslide | Sakshi
Sakshi News home page

గనిలో ఘోరం: ఐదుగురు మృతి.. 15 మంది గల్లంతు

Jun 30 2026 12:00 PM | Updated on Jun 30 2026 12:43 PM

At Least 5 Dead 15 Missing in Myanmar Jade Mine Landslide
  • విరిగిపడిన పాత మైనింగ్ వ్యర్థాల దిబ్బలు
  • మట్టిలో కూరుకుపోయిన 20 మంది కూలీలు 

హ్పాకాంత్: ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రం, హ్పాకాంత్ ప్రాంతంలో భారీ  వర్షాల కారణంగా ఒక పాత జేడ్ (పచ్చల) గని వ్యర్థాల కుప్ప ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 15 మంది గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పలువురు కార్మికులు గని వ్యర్థాలలో విలువైన రత్నాల ముక్కలను వెతుకుతుండగా, ఈ విపత్తు సంభవించింది. భారీ వర్షాల కారణంగా ఈ మట్టి దిబ్బలు అస్తవ్యస్తంగా మారాయని స్థానిక అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో సుమారు 20 మంది కూలీలు మట్టి కింద కూరుకుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ టీమ్‌లు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేసి, తవ్వకాలు జరుపుతున్నాయి. మయన్మార్ మైనింగ్ రంగంలో ఇటువంటి భారీ ప్రమాదాలు రుతుపవనాల కాలంలో సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రమాదకరమైన రీతిలో గనులు తవ్వడం, వ్యర్థాలను పెద్ద ఎత్తున పేరుకుపోయేలా చేయడం వల్ల వర్షాలకు ఇవి కుప్పకూలి ఇక్కడి పేద కూలీల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా జేడ్ లభించే ప్రాంతం ఉత్తర కచిన్ రాష్ట్రం. కాగా 2021లో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం పగ్గాలు చేపట్టినప్పటి నుండి మయన్మార్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ జేడ్ గనుల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఇటు దేశ సైన్యం, అటు ప్రతిపక్ష తిరుగుబాటు దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కొందరు కూలీలు  ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement