బయటపడిన అత్యంత పురాతన డైనోసార్ తోక! | 82 Million Year Old Titanosaur Fossil Discovered In Antarctica After Decades In Storage, Check More Details Inside | Sakshi
Sakshi News home page

బయటపడిన అత్యంత పురాతన డైనోసార్ తోక!

Jun 30 2026 11:37 AM | Updated on Jun 30 2026 12:25 PM

82-Million Year Old Titanosaur Fossil Discovered in Antarctica
  • ‘టైటానోసార్’ రకానికి చెందినదిగా గుర్తింపు
  • 40 ఏళ్ల పాటు ఎవరూ పట్టించుకోని వైనం

న్యూయార్క్‌: భూమిపై జీవించిన అత్యంత భారీ డైనోసార్ రకానికి చెందిన ‘టైటానోసార్’ శిలాజాన్ని శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో కనుగొన్నారు. ఈ శిలాజాన్ని 1985లోనే బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే సభ్యులు,  భూగర్భ శాస్త్రవేత్త మైక్ థామ్సన్ జేమ్స్ రాస్ ఐలాండ్‌లో సేకరించారు. అయితే అప్పట్లో ఇది ఏదో సముద్ర జీవికి చెందినదని భావించి, యూకేలోని ఒక సేకరణలో భాగంగా అల్మారాలో పడేసారు.

‘ఆక్టా పలేయోంటోలాజికా పొలోనికా’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఇది డైనోసార్‌దేనని తేల్చింది. శిలాజ శాస్త్రవేత్త పలేయోంటోలాజిస్ట్ మార్క్ ఎవాన్స్ దీనిపై అనుమానంతో లండన్ సహచరుడు పాల్ బారెట్‌ను సంప్రదించగా, అది 82 మిలియన్ల సంవత్సరాల నాటి టైటానోసార్ తోక ఎముక (వర్టెబ్రా) అని స్పష్టమైంది. పది సెంటీమీటర్ల పొడవున్న ఈ ఎముకకు ఒక వైపు గుంత, మరోవైపు గుండ్రటి ఉబ్బెత్తు భాగం ఉన్నాయి. ఇది బాల్-అండ్-జాయింట్ సాకెట్ అమరికను సూచిస్తుందని, ఈ లక్షణం కేవలం ఈ రకమైన డైనోసార్లలోనే ప్రత్యేకంగా ఉంటుందని బారెట్ పేర్కొన్నారు. ఈ శిలాజం అసంపూర్తిగా ఉండటం వల్ల ఖచ్చితమైన జాతిని గుర్తించలేకపోయారు. కానీ ఇది కేవలం 23 అడుగుల పొడవు కలిగి, చిన్న వయసులోనే చనిపోయి సముద్రంలో మునిగి ఉంటుందని ప్రాథమిక విశ్లేషణలో తేలింది.

మిలియన్ల సంవత్సరాల క్రితం అంటార్కిటికా ఖండం ప్రస్తుతం ఉన్నట్లు మంచుతో కాకుండా, అధిక కార్బన్ డయాక్సైడ్, తీవ్రమైన అగ్నిపర్వత చర్యల వల్ల డైనోసార్ల మనుగడకు అనుకూలమైన పచ్చని ప్రాంతంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఇది గడ్డకట్టే మంచు ఖండంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 98 శాతం మేర మైళ్ల కొద్దీ మంచు పేరుకుపోవడంతో, ఇలాంటి పురాతన శిలాజాలను వెలికితీయడం పరిశోధకులకు అత్యంత కష్టతరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement