విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ హీరో అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’, ‘హిట్’ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా సామాజిక అంశాలపైనా దృష్టిసారిస్తున్నారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న మూగజీవాల కోసం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటికి అండగా నిలిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఏం చేయబోతున్నాడంటే..
అసోం, కేరళ, గుజరాత్, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణెతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని మూగజీవాలను రక్షించేందుకు స్థానిక జంతు సంరక్షణ సంస్థలు, రెస్క్యూ బృందాలతో కలిసి అడివి శేష్ బృందం పనిచేయనుంది. వరదల్లో చిక్కుకున్న, గాయపడిన జంతువులను రక్షించడంతో పాటు వాటికి ఆహారం, తాగునీరు, ఆశ్రయం, వైద్య చికిత్స అందించనున్నారు.
ఓ ప్రాణాన్ని కాపాడొచ్చు..
అడివి శేష్ మాట్లాడుతూ.. ‘వర్షాకాలం మనలో చాలామందికి అందంగా కనిపిస్తుంది. కానీ వేలాది మూగజీవాలకు ఇది అత్యంత కష్టమైన సమయం. మనకు వర్షం పడితే వెళ్లేందుకు ఇల్లు ఉంది. కానీ వాటికి అలాంటి సౌకర్యం ఏదీ లేదు. ఆహారం దొరకకపోవడం, ఆశ్రయం లేక వర్షంలో తడవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం.
జంతు సంరక్షణ కోసం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇంటి బయట వాటికి కాస్త ఆశ్రయం కల్పించడం, ఆహారం, స్వచ్ఛమైన నీరు అందించడం వంటివి చేస్తే చాలు. మనం చేసే ఈ చిన్న సాయంతో ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు’ అని అన్నారు.
జంతు సంరక్షణ సంస్థలు, రెస్క్యూ సిబ్బంది, వాలంటీర్లు ప్రతిరోజూ చేస్తున్న సేవలను అడివి శేష్ అభినందించారు. వర్షాకాలంలోనే కాకుండా ఏడాది పొడవునా మూగజీవాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అడివి శేష్ చివరిగా ‘డకాయిట్’లో కనిపించారు. ఈ సినిమా తర్వాత ఆయన డెబ్యూ దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడితో కలిసి ‘G2’ (గూఢచారి 2) చేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


