షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా 2014లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకు ముందుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను సంప్రదించారట దర్శకురాలు ఫరాఖాన్. కానీ ఆ సమయంలో భర్త అభిషేక్ బచ్చన్‌తో కూడా నటిస్తుండటం, షారుఖ్‌తో ఎక్కువ కెమిస్ట్రీ సీన్లు ఉండటంతో ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించిందట.
ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్నా. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేసి ఉంటే మంచి కంబ్యాక్ అయ్యేది. నటిగా ఆ అవకాశాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కానీ భార్యగా ఆ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఐశ్వర్య చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలోనూ నటిస్తోంది.


