Sana Saeed: నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను.. | Sana Saeed's Viral Instagram Post On The Issue Of Bulimia | Sakshi
Sakshi News home page

Sana Saeed: నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను..

Jul 25 2026 8:25 AM | Updated on Jul 25 2026 8:25 AM

Sana Saeed's Viral Instagram Post On The Issue Of Bulimia

సోషల్‌ మీడియా

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ఖాన్‌తో ‘కుచ్‌ కుచ్‌ హోతాహై’ సినిమాలో నటించిన సనా సయిద్‌ ‘నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలియజేసింది. ‘బులీమియా అంటే ఏమిటి?’ అనే ఆసక్తిని ఎంతోమందిలో రేకెత్తించింది....

చాలా చిన్న వయసు నుంచే తనకు బులీమియా ఉన్నట్లు తెలియజేసింది సనా సయిద్‌. ‘నాకు బులీమియా అనే ఈటింగ్‌ డిజార్డర్‌ ఉన్నట్లు చాలా సంవత్సరాల వరకు తెలియదు. బులీమియా అనే మాట ఎప్పుడూ వినలేదు. అయితే ఒకానొక రోజు బులీమియా గురించి ఒక పుస్తకం చదివినప్పుడు నాకు ఏంజరుగుతుందో మొదటిసారి అర్థమైంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నవ్వుకుంటారేమో అనే భయం వల్ల చాలా కాలం పాటు నా సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేదు’ అంటుంది సనా సయిద్‌.

సాధారణ బరువుతోనే కనిపించడం వల్ల బులీమియాను గుర్తించడం అతి పెద్ద సవాలు. జన్యుపరమైన కారణాలతో పాటు మానసిక ఒత్తిడిలాంటి సమస్యలు...మొదలైనవి బులీమియాకు కారణం అవుతాయి. బులీమియా ఉన్న వ్యక్తులు డిప్రెషన్‌ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

కొన్ని లక్షణాలు...

భోజనం చేసిన వెంటనే టాయిలెట్‌కు వెళ్లడం.

తమ శరీర బరువు, ఆకారంపై ఎప్పుడూ ఆందోళనతో ఉండడం.

పదే పదే కఠినమైన ఆహార నియమాలను పాటించి ఆపై అతిగా తినడం.

తిన్న తరువాత బరువు పెరగకుండా నిరోధించడానికి స్వయంగా వాంతులు చేసుకోవడం.

మార్గం ఉంది...
సనా సయిద్‌ ఎమోషనల్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘నేను బులీమియా సమస్యతో బాధ పడ్డాను అని బహిరంగంగా చెప్పుకోవడానికి కారణం... ఇలాంటి సమస్యతో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు సతమతమవుతుంటారు. తమకు పేరు కూడా తెలియని సమస్యతో బాధ పడుతూ ఉండవచ్చు. దానికి ఒక పేరు ఉందనే విషయం వారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఒంటరి వారు కాదు. సమస్య నుంచి బయటపడే మార్గం ఉంది. సమస్య నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. మీరు ఇబ్బంది పడుతుంటే దయచేసి వైద్యులను సంప్రదించండి.

నాకు ఈటింగ్‌ డిజార్డర్‌ ఉందని అంగీకరంచడం అత్యంత కష్టం కావచ్చు. కానీ తప్పదు. సమస్యను దాచివేస్తే, భయపడితే ఆ సమస్యతో మనం పోరాడలేము’ అంటుంది సనా సయిద్‌.

బులీమియా అంటే...
తక్కువ సమయంలో అసాధారణంగా, అధిక మొత్తంలో ఆహారం పదే పదే తీసుకునే రుగ్మతను బులీమియా  నెర్వోసా అంటారు. బులీమియా ఉండే వ్యక్తులు తీవ్రమైన సిగ్గు, అపరాధ భావంతో ఉంటారు. ఎవరికీ చెప్పుకోకుండా అత్యంత గోప్యంగా ఉంచబడే మానసిక ఆరోగ్య సమస్యలలో బులీమియా ఒకటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement