breaking news
Bulimia
-
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్‌లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్‌ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.పలురకాల చికిత్సలు అవసరం..బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.– యాంటీడిప్రెసెంట్స్తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.బులీమియా లక్షణాలు...– ఒకే సిట్టింగ్‌లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం– విపరీతమైన మూడ్ స్వింగ్స్‌ని కలిగి ఉండటం.బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్‌కు మధ్య తేడా.. బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
ఈటింగ్ డిజార్డర్స్ తిండి తిప్పలు!
తినడం కూడా కొన్ని వ్యాధుల లక్షణమే అంటే అది విచిత్రంగా ఉండవచ్చు. కానీ అది వాస్తవం. తీవ్రమైన భావోద్వేగాలు, కోపం, ప్రవర్తనలో మార్పులు, వ్యాకులత, యాంగ్జైటీ వంటి అనేక సమస్యల వల్ల మనం తినే తీరులో మార్పులు వచ్చి... సదరు వ్యాధికి ఒక లక్షణంగా ప్రకటితమవుతాయి. కొన్నిసార్లు అవి భౌతికంగా మార్పులు మాత్రమే కాదు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మహిళలూ, పురుషులూ... ప్రత్యేకంగా కౌమార వయసులోకి వచ్చే టీనేజీ పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ భోజనరుగ్మతలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ఈటింగ్ డిజార్డర్స్కు కారణాలు ఆహార రుగ్మతలకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రవర్తనపూర్వకమైనవి, జీవసంబంధమైనవి, ఉద్వేగాలకు, సంబంధించినవి, మానసికమైనవి, వ్యక్తిగతబంధాలకు సంబంధించినవి, సామాజిక అంశాలు... ఇలా రకరకాల కారణాలు ఆహారసంబంధ రుగ్మతలకు దారితీస్తాయి. ఇందులో చాలావరకు మానసికమైనవి. అవి క్రమంగా శారీరక ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతూ న్యూనతను కలిగిస్తాయి. 1. అనొరెక్సియా నర్వోజా సాధారణంగా పిల్లలు టీనేజీలోకి వస్తుండగానే తమ అందంపైనా, లుక్స్పైనా దృష్టి ఎక్కువగా ఉంటుంది. తాము లావెక్కి అసహ్యంగా కనిపిస్తున్నామేమో అన్న సందేహం వారిని పట్టి పీడిస్తుంటుంది. ఏమాత్రం ఎక్కువగా తిన్నా బరువు పెరిగి అందం దెబ్బతింటుందేమో అన్న సంశయంతో వారు కావాలనే తినడం మానేస్తుంటారు. దాంతో ఉండాల్సిన దాని కంటే మరీ ఎక్కువగా బరువు తగ్గి ఎముకలపోగులా మిగిలిపోతారు. కావాలన్నా తినలేని ఈ రుగ్మత పేరే ‘అనొరెక్సియా నర్వోజా’ బాల్యం నుంచి కౌమార దశలోకి ప్రవేశించేవారిలో ముఖ్యంగా అమ్మాయిల్లో కనిపించే ఈ జాడ్యం 5 శాతం నుంచి 20 శాతం మందిలో ప్రాణాంతకంగా మారుతుంది. ఇటీవల టీవీల్లో, సినిమాల్లో, ర్యాంప్షోలలో, ఇతర ప్రసారమాధ్యాలలో కనిపించే మోడల్స్‌ను అనుసరిస్తూ అలా సన్నగా ఉండటమే అందం అనే భావనలో జీరోసైజ్ అంటూ ఈ వ్యాధికి గురయ్యేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే దీన్ని ‘ఫ్యాషన్ డిజార్డర్’ అని కూడా వ్యవహరిస్తుంటారు. లక్షణాలు ♦ వారి శరీర పోషణకూ, జీవక్రియలకూ అవసరమైనదాని కంటే చాలా తక్కువగా తినడం ♦ తినే సందర్భం వస్తే అక్కడి నుంచి తప్పించుకోవడం ♦ తమ శరీరంపై ఎక్కువ స్పృహ కలిగి ఆత్మన్యూనతతో వ్యవహరించడం ♦ తమ పరిస్థితి తమకు తెలుస్తున్నా దాన్ని గుర్తించేందుకు సంసిద్ధంగా లేకపోవడం. హెచ్చరిక సూచనలు (వార్నింగ్ సిగ్నల్స్) ♦ గణనీయంగా బరువు తగ్గిపోవడం ♦ ఎప్పుడూ బరువు తగ్గడం గురించి, క్యాలరీలను తక్కువ చేసుకోవడం గురించి, కొవ్వు కరిగించుకోవడం, డైటింగ్ గురించే ప్రస్తావిస్తుండటం. ♦ చాలా రుచికరమైన ఆహారం ముందుంచినా తినడానికి తిరస్కరించడం ♦ నేనేమైనా లావుగా కనిపిస్తున్నానా అంటూ వాకబు చేస్తుండటం. ♦ తినడం తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు వెతుక్కుంటూ ఉండటం. ♦ తాము బరువు పెరగడం లేదని తెలిసినా, ఎక్కడ బరువు పెరుగుతామో అన్న ఆందోళనతో క్యాలరీస్‌ను దహించాలంటూ కఠినమైన వ్యాయామాలకు పాల్పడటం. ♦ స్నేహితులనుంచి క్రమంగా దూరం కావడం. అనొరెక్సియాతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ♦ శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయి. దాంతో శరీరం తనలోని శక్తిని ఆదా చేసుకోవడానికి సాధారణంగా జరగాల్సిన జీవక్రియలన్నింటినీ మందకొడిగా జరిగేలా చూస్తుంది. ఈ ‘మందకొడి’ ప్రక్రియ వల్ల తీవ్రస్థాయిలో వైద్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు... ♦ గుండె స్పందనల వేగం మందగిస్తుంది. రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా గుండె కండరాల పనితీరులో కూడా మార్పు వస్తుంది. ఇది క్రమంగా హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. ♦ ఎముకల సాంద్రత మందగిస్తుంది. దాంతో ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఎముకలు పెళుసుగా మారి తేలిగ్గా విరిగిపోవచ్చు. ♦ కండరాలు బలహీనంగా మారవచ్చు. సన్నబడిపోవచ్చు. ♦ తీవ్రమైన డీ-హైడ్రేషన్‌కు దారితీయవచ్చు. దానివల్ల మూత్రపిండాలు దెబ్బతినవచ్చు. ♦ నీరసం, నిస్సత్తువతోపాటు ఒక్కోసారి స్పృహతప్పడం జరగవచ్చు. ♦ వెంట్రుకల కింద ఉండే ‘ల్యానుగో’ అనే ఒక పొర మందంగా మారుతుంది. శరీరం తన వేడిని కోల్పోకుండా ఉండేందుకు ఈ పరిణామం సంభవిస్తుంది. 2. బులీమియా నర్వోజా బులీమియా నర్వోజా అనే వ్యాధి చాలా తీవ్రమైనది. ఈ రుగ్మతలో... బింజ్ఈటింగ్ అని పిలిచే అదేపనిగా తినే అలవాటుతో పాటూ... తింటే బరువు పెరిగిపోతామేమో అనే అనొరెక్సియా లక్షణాలూ కలగలసి ఉంటాయి. బులీమియా నర్వోజా వ్యాధి ఒక్కోసారి డిప్రెషన్ లక్షణాలతో కలగలసి ఉంటుంది. ఒక్కోసారి ఇది మరణానికి సైతం దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు ♦ భోజనంపై అమిత ఇష్టం వల్ల రుచికరమైన పదార్థాలపై మోజు కారణంగా మొదట ఆహారాన్ని తినేస్తారు. ఆ తర్వాత తాము తిన్న పదార్థాల వల్ల అపరిమితంగా బరువు పెరిగిపోతామేమో అన్న ఆందోళనతో ప్రయత్నపూర్వకంగా వాంతి చేసుకుంటారు. ♦ తినే విషయంలో స్వీయనియంత్రణ చేసుకోలేరు. తిన్న తర్వాత తమంతట తామే బరువు పెంచుకుంటున్నామేమో అంటూ తీవ్ర అపరాధ భావనకు లోనవుతారు. ♦ శరీరాకృతిపై అవసరమైన దాని కంటే ఎక్కువగా దృష్టిసారించి ఆత్మన్యూనతకు లోనవుతారు. ♦ బులీమియా నర్వోజా వ్యాధిని ఎంత త్వరగా నిర్ధారణ చేయగలిగితే... దీని నుంచి బయటపడే అవకాశాలు అంత ఎక్కువ. హెచ్చరిక సూచనలు (వార్నింగ్ సిగ్నల్స్) ♦ చాలా తక్కువ సమయంలో ఎక్కువగా తినేస్తారు. ఆతృతగా తినేస్తుంటారు. ♦ జిహ్వచాపల్యాన్ని తట్టుకోలేక తినేశామనీ... కానీ తాము తిన్నది తమకు అవసరం లేనిదన్న భావనతో దాన్ని ఎలాగైనా వదులుకోవాలనే కోరికతో తరచూ బాత్రూమ్కు వెళ్లి ఎవరూ చూడకుండా వాంతి చేసుకుంటారు. ♦ కొందరు తాము తిన్నదాన్ని వదులుకోడానికి వాంతి చేసుకోడానికి బదులు విరేచనం చేసుకోవాలనే ఉద్దేశంతో అవసరానికి మించి విరేచనకారి (లాక్సెటివ్స్), అతిగా మూత్రం వచ్చే మందులు (డై-యూరెటిక్స్) వాడతారు. ♦ క్యాలరీలను కరిగించుకోవాలంటూ కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. ♦ రోగుల్లో అసాధారణరీతిలో చెంపలు, దవడల వాపు కనిపిస్తుంది. ♦ వేళ్లను నోటిలోకి జొనిపి వాంతి చేసుకుంటుంటారు కాబట్టి వేళ్ల కణుపులు (నకుల్స్) పళ్లతో ఒరిపిడికి గురై చర్మం మందంగా మారుతుంది. ♦ తరచూ వాంతుల వల్ల పళ్లరంగు మారుతుంది. ♦ స్నేహితుల నుంచి దూరంగా ఉంటారు. ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. బులీమియాతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ♦ అదేపనిగా ఎక్కువగా తినేయడం, ఆ తర్వాత మళ్లీ వాంతి చేసుకోవడం వెంటవెంటనే జరుగుతుండటం వల్ల జీర్ణక్రియలోని క్రమబద్ధతపై ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ సైకిల్ దెబ్బతింటుంది. ♦ డీ-హైడ్రేషన్ వల్ల శరీరంలో పొటాషియమ్, సోడియమ్ పాళ్లు తగ్గుతాయి. ♦ గుండె స్పందనలు లయ తప్పుతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాపాయం కలిగించవచ్చు. ♦ ప్రయత్నపూర్వకంగా మాటిమాటికీ చేసుకునే వాంతుల వల్ల కడుపులో మంట వస్తుంది. ♦ కడుపులో ఉండే యాసిడ్ వాంతి వల్ల బయటకు వచ్చి, పళ్లపై ప్రభావం చూపడం వల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ♦ విరేచనకారి మందులను విచక్షణరహితంగా వాడటం వల్ల విసర్జన అలవాట్లలో మార్పు, దీర్ఘకాలిక మలబద్దకం వంటి అనర్థాలు వస్తాయి. 3. బింజ్ ఈటింగ్ డిజార్డర్ (బీఈడీ) ఈ రుగ్మత ఉన్న రోగులు ఏ ఆహారాన్ని అయినా అదేపనిగా తినేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లుగా తింటూ ఉంటారు. దీన్నే ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అంటారు. ఇది డిప్రెషన్ వ్యాధితో పాటు కలగలిసి ఉంటుంది. వీరిలో జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తక్కువ. లక్షణాలు ♦ ఎప్పుడూ తినాలనిపించే తమ కోరికను నియంత్రించుకోలేరు. ♦ అలా తింటూ ఉండటమూ, దాన్ని మిగతావాళ్లు గమనిస్తూ ఉన్నారన్న విషయం వాళ్లలో అపరాధభావనను కలిగిస్తుంది. ♦ అదేపనిగా తినడం తమకే నచ్చక ఆత్మన్యూనతకు గురవుతుంటారు. బింజ్ ఈటింగ్ వల్ల కలిగే ఆరోగ్య అనర్థాలు ♦ బింజ్ ఈటింగ్ వల్ల కనిపించే తక్షణ అనర్థం బరువు అమితంగా పెరిగిపోవడం. రోగికి స్థూలకాయం రావడం. దాంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. ఉదాహరణకు... ♦ రక్తపోటు విపరీతంగా పెరగడం ♦ కొలెస్ట్రాల్ పాళ్లు పెరిగిపోవడం ♦ డయాబెటిస్ గాల్‌బ్లాడర్‌కు సంబంధించిన వ్యాధులు ♦ కండరాలూ, ఎముకల రుగ్మతలు గుండెజబ్బులు 4. డయాబులీమియా ఇది సాధారణంగా టైప్-1 డయాబెటిస్తో కలిసి ఉండే తిండి సంబంధమైన రుగ్మత. డయాబులీమియా వ్యాధిగ్రస్తులు తమ బరువు తగ్గాలనే ఉద్దేశంతో కావాలనే ఇన్సులిన్ పాళ్లను తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో డయాబెటిస్, బులీమియా... ఈ రెండు వ్యాధులూ ఉంటాయి కాబట్టి ‘డ్యుయల్ డయాగ్నోసిస్ డిజార్డర్’గా పేర్కొంటారు. ఈ వ్యాధి ఉన్నప్పుడు ఇన్సులిన్ ఉపయోగించే తీరును దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఇది ఇతర రుగ్మతలకూ దారితీసే అవకాశమూ ఉంది. 5. ఆర్థోరెక్సియా నర్వోజా ఇది సరైన ఆహారం తీసుకోవాలనే తపన నుంచి ఆవిర్భవించే రుగ్మత. ఆర్థోరెక్సియా నర్వోజాకూ... అనొరెక్సియా, బులీమియాలకూ ఓ తేడా ఉంది. అనొరెక్సియా, బులీమియాలో అందాలకూ, లుక్స్కూ ప్రాధాన్యమిస్తారు. కానీ ఆర్థోరెక్సియా నర్వోజా రోగులకు అన్నీ ఆరోగ్య సంబంధమైన సందేహాలే! తాము తిన్నది సరైన ఆహారమేనా, అది సమతులాహారమేనా అనే సందేహాలు రోగిని పట్టి పీడిస్తుంటాయి. తాము ఆరోగ్యకరమైన పరిణామంలోనే తింటున్నామా లేక ఎక్కువగానో, తక్కువగానో తింటున్నామా అనే సంశయాలు వస్తుంటాయి. దీంతో వారు తిండి విషయంలో చాలా కఠినమైన నియమాలు పెట్టుకుని ఆచరిస్తుంటారు. ప్రతిదీ తినేప్పుడు దాని ఆరోగ్యవిలువలూ, పోషకాలూ వంటి లెక్కలేసుకుని తింటుంటారు. ఫలానా పదార్థం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా దానినుంచి దూరంగా ఉంటారు. తమ జిహ్వచాపల్యాన్ని కఠినంగా నియంత్రించుకుంటూ తమను తాము శిక్షించుకుంటుంటారు. నూనెలు ఎక్కువ తీసుకుంటే కొవ్వు పేరుకుంటుందేమోననే సందేహంతో వాటిని తగ్గించి... కొవ్వుల్లో కరిగే విటమిన్ల లోపాలు తెచ్చుకుంటారు. ఉప్పు ఆరోగ్యానికి అనర్థమంటూ బాగా తగ్గించుకుని హైపోనేట్రీమియా లాంటి జబ్బులతో ఆసుపత్రుల పాలవుతుంటారు. ఇటీవల ఆరోగ్య స్పృహ మరీ ఎక్కువగా పెరగడంతో వచ్చిన అనర్థమిది. ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో మంచి నియమాలు పాటించడంలో తప్పులేదు. కానీ అదేపనిగా ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ ఒకరకమైన నిస్పృహకూ, న్యూనతకూ గురయి ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకోవడం సరికాదు. కాబట్టి ఆరోగ్యస్పృహనూ మరీ పెచ్చుమీరిపోనివ్వకుండా ఉండాలి. ఆర్థోరెక్సియాను అధిగమించడానికి మార్గాలు : ♦ ఎప్పుడైనా, ఏదో ఒక సమయంలో వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తే దాని గురించి అతిగా ఆలోచించకూడదు. ఎప్పుడో ఒకసారి జరిగే ఉల్లంఘన వెంటనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలేమీ చూపదు. ♦ ఎప్పుడైనా రుచికరమైన ఆహారాన్ని జిహ్వను సంతృప్తి పరచడానికి తినడం వల్ల వెంటనే ఆరోగ్యమేమీ దెబ్బతినదు. దాని గురించి అతిగా ఆలోచించకుండా వెంటనే ఆ విషయాన్ని మరచిపోవాలి. చేసిన పొరబాటు కంటే పొరబాటును మాటిమాటికీ తలచుకోవడమే ఎక్కువ కీడు చేస్తుంది. ♦ అపరాధ భావనతో కుంగిపోతూ ఒంటరిగా ఉండకూడదు. అందరితో కలిసి ఆనందంగా ఉండాలి. చికిత్సలు... ♦ ఆహార రుగ్మతలకు చికిత్స దీర్ఘకాలం పాటు బహుముఖంగా జరగాల్సి ఉంటుంది. ఇందులో మానసిక చికిత్స, సైకలాజికల్ కౌన్సెలింగ్, కొన్ని రకాల మందులు, న్యూట్రిషన్ లోపాలు కలుగుతాయి కాబట్టి వాటిని భర్తీ చేసే విధంగా పోషకాహారాలు... ఇలా అనేక అంశాలతో ఈ చికిత్స జరగాల్సి ఉంటుంది. ఈ ఆహారరుగ్మతలకు చికిత్స నిర్దిష్టంగా ఉండక, సమస్యను బట్టి ఉంటుంది. ♦ కొన్ని సందర్భాల్లో మానసిక, వ్యక్తుల మధ్య బాంధవ్యసంబంధాల (ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్), సాంస్కృతిక అంశాల ఆధారంగా కూడా ఆహారరుగ్మతలు రావచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో వాటిని పరిగణనలోకి తీసుకుని చికిత్స-ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ♦ ఆహారం అన్నది మనకు ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతిని కలిగించడానికి అని గుర్తించి దాన్ని ఆస్వాదిస్తూ భుజించాలి. అంతే తప్ప కేవలం క్రమబద్ధమైన జీవితంలోని ఒక అనివార్య అంశంగా మాత్రమే భావించకూడదు. ♦ ఆహారరుగ్మతల విషయంలో సమస్యలు ఎదురైతే సరైన అర్హతలు ఉన్న సైకియాట్రిస్ట్, ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్, మెడికల్ డాక్టర్, కొన్ని సందర్భాల్లో సామాజికవేత్తల వంటి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. అంతేగాని చెప్పుడు మాటలు వినడం, తగిన విద్యార్హతలు లేని వారి సలహాలతో జీవితాన్ని మరింత దుర్భరం చేసుకోకూడదు. - నిర్వహణ: యాసీన్