మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘డ్యూడ్’ ‘జన నాయకన్’ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూర్యతో కలిసి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఈ శుక్రవారం(ఆగస్టు 14) ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కేరళలో శనివారం జరిగింది. ఇందులో మాట్లాడిన మమిత తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకుంది.
‘2015లో సూర్య ఓ కార్యక్రమం కోసం కొచ్చి వచ్చారు. అప్పుడు నేను ఎనిమిది, మా అన్నయ్య ఇంటర్ చదువుతున్నాం. సూర్యని చూసేందుకు అన్నయ్య తన స్నేహితులతో కలిసి కొచ్చి వెళ్లాడు. నేనూ వెళ్తానంటే మా తల్లిదండ్రులు పంపించలేదు. అన్నయ్య సూర్యతో ఫొటో దిగి చూపించాడు. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు అదే హీరోతో కలిసి నటించే అవకాశం దక్కింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్యతో కలిసి ఒకే వేదికపై నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని మమిత చెప్పుకొచ్చింది. అభిమానిగా సూర్యని చూడాలనుకున్న తనకు.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప ఆశీర్వాదమని పేర్కొంది.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 45 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఇందులో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.


