బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటనలతో అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 18వ సీజన్ తొలి ఎపిసోడ్‌లో అమిర్‌ఖాన్, సన్నీడియోల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బచ్చన్ కుటుంబంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాల్లో తనకు అత్యంత ఇష్టమైనది ఏంటని ప్రీతిని అడగ్గా.. ఓ సరదా సంఘటన గుర్తుచేసుకుంది.

‘బచ్చన్ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తా, గౌరవిస్తా. అమిత్‌జీతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూశాను. అందుకోసం చాలా ప్రయత్నించాను. చివరకు 2003లో వచ్చిన ‘అర్మాన్’లో ఆయనతో నటించే అవకాశం వచ్చింది. దర్శకురాలు హనీ ఇరానీతో ఈ సినిమాలో అమిత్‌జీతో నాకు ఒక్క సీన్ అయినా ఉండాలని అడిగాను. అందుకు హనీ ఇరానీ సరదాగా.. ‘‘అమిత్‌జీతో నటించాలని అంతగా కోరుకుంటున్నావా? అయితే ఆ సీన్‌లో నువ్వు చనిపోవాల్సిందే’’ అన్నారు. దీంతో మూవీ నా పాత్రని కోమాలో ఉండేలా పెట్టారు. నేను కోమాలో ఉన్నట్లు నటించాలి. అమిత్‌జీ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఎదురుగా ఉండటంతో తెగ భయపడిపోయాను. చనిపోయినట్లు నటించడం ఎంత కష్టమో అప్పుడే తెలిసింది. నేను కదులుతుండటంతో.. ‘ప్రీతి సీన్ పాడుచేస్తున్నారు.. మీరు కదులుతున్నారు’ అని టీమ్ వాళ్లు నాపై కోపంగా అరిచేవాళ్లు’ అని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.
2003లో రిలీజైన ‘అర్మాన్’లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలు చేశారు. ప్రీతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. వెంకటేశ్ సరసన ‘ ప్రేమంటే ఇదేరా’, మహేశ్ రాజకుమారుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


