రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారట. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను సెప్టెంబరు చివర్లో లేదా అక్టోబరు ప్రారంభంలో మొదలుపెట్టాలని దర్శకుడు హసిత్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ ఆరంభించి, పూర్తి చేస్తే పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం లభిస్తుందని భావిస్తున్నారట హసిత్. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’ ఈ నెల 21న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌తో రవితేజ బిజీగా ఉంటారు. ఆ తర్వాత చిన్న విరామం తీసుకుంటారట. ఆ బ్రేక్ తర్వాత హసిత్‌తో చేయనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట రవితేజ. ఈ చిత్రానికి ‘వీరాధి వీరులంట: కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం.


