చైనాలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. భర్త.. భార్యను ప్రేమతో హంగ్ చేసుకున్నాడు.. అంతే, ఒక్కసారిగా ఎముకలు విరిగిన శబ్దం.. నొప్పితో విలవిల్లాడుతూ కిందపడిపోయింది. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ఐదు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. మరో ఎముకకూ పగులు ఏర్పడ్డాయి. చైనాలో జరిగిన ఈ ఘటన వెనుక అసలు కారణం తెలుసుకుని వైద్యులే ఆశ్చర్యపోయారు. తరచూ డైటింగ్ చేస్తూ భోజనం మానేయడం, ఎండకు దూరంగా ఉండటం వంటి అలవాట్లతో ఆమె ఎముకలు బలహీనపడటమే ఇందుకు కారణమని గుర్తించారు.
చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వాంగ్ అనే వ్యక్తి భార్య చలిగా ఉందని చెప్పడంతో ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎముకలు విరిగినట్లు శబ్దం వినిపించింది. వెంటనే ఆమె తీవ్రమైన నొప్పితో కిందకు వంగిపోయింది. పైకి లేవలేకపోయింది. తాను సాధారణంగానే కౌగిలించుకున్నానని.. ఇంత తీవ్రమైన గాయాలవుతాయని ఊహించలేదని వాంగ్ తెలిపాడు.
తన భార్య రాత్రంతా నొప్పితో బాధపడిందని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఛాతీకి సీటీ స్కాన్ చేశారు. అందులో ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరో పక్కటెముకకు సన్నటి పగులు ఏర్పడినట్లు తేలింది. అయితే, శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు నిర్ణయించారు. మందులు, నొప్పి తగ్గించే ఔషధ ప్యాచ్‌లు ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే కోలుకుంటోంది. ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది.
వైద్యులు ఆమెకు ఆస్టియోపొరోసిస్ ఉన్నట్లు గుర్తించినట్లు వాంగ్ వెల్లడించాడు. ఈ వ్యాధి కారణంగా ఎముకల సాంద్రత తగ్గి.. అవి బలహీనంగా మారతాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికే ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. ఆయన భార్య బరువు 45 నుంచి 50 కిలోల మధ్య ఉంటుంది. బరువు తగ్గేందుకు తరచూ డైటింగ్ చేసేది. ఒక్కోసారి రాత్రి భోజనం కూడా మానేసేది. రోజూ కనీసం ఒక కప్పు కాఫీ తాగేది. ఆమె కుటుంబానికి చెందిన దుకాణంలో పనిచేస్తుండగా.. ఆ షాపు ఇంటి నుంచి కారులో రెండు, మూడు నిమిషాల దూరంలోనే ఉంది. బయటకు వెళ్లినప్పుడు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పుకునేది. ఎండలో ఎక్కువసేపు గడిపేది కాదు.
శరీరంలో విటమిన్ డి ఉత్పత్తికి సూర్యరశ్మి కీలకం. విటమిన్ డి ద్వారా శరీరం కాల్షియాన్ని సమర్థంగా గ్రహించగలుగుతుంది. ఎముకల సాంద్రతను కాపాడుకోవడానికి ఇది అవసరం. ఈ ఘటన తర్వాత తన భార్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని వాంగ్ తెలిపాడు. ఆమె ఎక్కువగా ఎండలో గడపడంతో పాటు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టిందని చెప్పాడు.
వుహాన్ ఆసియా హార్ట్ జనరల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు యాన్ యాన్‌షియాంగ్ ఈ ఘటనపై స్పందించారు. సాధారణంగా యువతలో కౌగిలింత వంటి సాధారణ చర్యతో పక్కటెముకలు విరగడం చాలా అరుదని తెలిపారు. ఈ మహిళకు ఉన్న ఆస్టియోపొరోసిస్ గాయాల తీవ్రతకు కారణమై ఉండవచ్చని వివరించారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు.
ఎండలో తక్కువగా గడపడం, రోజూ కాఫీ తాగడం వంటి అలవాట్లను ప్రస్తావిస్తూ.. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం నష్టం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. బలమైన టీని అధికంగా తాగడం, ఇతర అనారోగ్యకరమైన అలవాట్లు, స్టెరాయిడ్ మందుల వాడకం కూడా ఎముకల నుంచి కాల్షియం నష్టాన్ని వేగవంతం చేయవచ్చని వివరించారు..
抱断老婆 5 根肋骨 网传江苏一男子给老婆一个“热情拥抱”,老婆当场蹲地起不来 CT一拍:5根肋骨骨折,1根骨裂。 男子说本想抱紧点让她感受自己的热情,“真不是故意的”。 https://t.co/s3iiSLtXc7
— 像树 (@gexx126657) October 19, 2026
ఇదీ చదవండి: ఆకాశం నుంచి పిట్టల్లా రాలిపోతున్న ఉక్రెయిన్ డ్రోన్లు!


