రష్యాపై దాడులకు వెళ్లిన ఉక్రెయిన్ డ్రోన్లు.. ఉన్నట్టుండి ఆకాశం నుంచి పిట్టల్లా రాలిపోతున్నాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయాల్సిన డ్రోన్లే కనెక్షన్ కోల్పోయి కుప్పకూలుతున్నాయి. అమెరికా రక్షణ శాఖ నియంత్రణలో పనిచేసే స్టార్‌షీల్డ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో అంతరాయమే ఇందుకు కారణమని ఉక్రెయిన్ సైనికాధికారులు చెబుతున్నారు.
ఈ అంతరాయం కారణంగా సైనిక విభాగాలు మూడు రోజుల పాటు దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. రష్యా సైనిక కమాండ్ కేంద్రాలు, ఇంధన నిల్వ కేంద్రాలపై దాడులు కూడా ఆగిపోయాయి. రష్యా సైన్యం ముందుకు సాగకుండా అడ్డుకోవడంతో పాటు.. ముందు వరుసలో ఉన్న తమ సైనికులను రక్షించుకునేందుకు ఉక్రెయిన్ ఈ దాడులను జరుపుతోంది.
స్టార్‌లింక్ సేవల కోతతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వైరం మరింత తీవ్రతరమవుతోంది. స్టార్‌షీల్డ్ సేవల్లో తొలుత ఏర్పడిన అంతరాయం కారణంగా గంటకు కేవలం 40 మైళ్ల (సుమారు 64 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణించే డ్రోన్లు కూడా కనెక్షన్ కోల్పోయాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. గంటకు 100 మైళ్ల (సుమారు 161 కిలోమీటర్ల) కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు డ్రోన్లు ఇప్పటికీ కనెక్షన్ కోల్పోతున్నాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో రష్యా లక్ష్యాలపై దాడులు చేసేందుకు అధిక వేగంతో ప్రయాణించాల్సిన డ్రోన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తూర్పు ఉక్రెయిన్‌లో వేలాది మంది సైనికులతో కూడిన దళాలకు ఇటీవల బాధ్యతలు చేపట్టిన బ్రిగేడియర్ జనరల్ ఆండ్రి బిలెట్స్కీ ఈ అంశంపై స్పందించారు. గతంలో స్టార్‌షీల్డ్ కనెక్షన్‌తో పనిచేసే డ్రోన్లు గంటకు 250 మైళ్ల (సుమారు 402 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణించినా కనెక్షన్ కోల్పోయేవి కావని ఆయన తెలిపారు.
ఈ ఆంక్షలు ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలపైనా ప్రభావం చూపుతున్నాయి. రష్యా డ్రోన్లు ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేయకుండా అడ్డుకునేందుకు ఉపయోగించే ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు.. శత్రు డ్రోన్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘వైమానిక రక్షణ వ్యవస్థల వేగాన్ని తగ్గించడం బాధాకరమైన నిర్ణయం. ముఖ్యంగా మన నగరాల రక్షణను ఇది బలహీనపరుస్తుంది. పెంటగాన్ ఈ చర్య తీసుకోవడం ఉక్రెయిన్ పౌరుల పట్ల స్నేహపూర్వకంగా లేని నిర్ణయమేనంటూ బిలెట్స్కీ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు ఎలాన్ మస్క్ షాక్!


