కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లో సైనిక అవసరాల కోసం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్న ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగాన్ని స్పేస్‌ఎక్స్ సంస్థ తగ్గించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో ఉక్రెయిన్ డ్రోన్ల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అమెరికా అధికారులు, సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ సైన్యం డ్రోన్లతో వరుస దాడులు జరుపుతుండటంటపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ చేస్తున్న ఈ దాడుల వల్ల గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన సరఫరా తగ్గి, ధరలు విపరీతంగా పెరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని ట్రంప్ భావించారు. అంతేకాకుండా, యుద్ధాన్ని త్వరగా ముగించాలనే తన శాంతి ప్రయత్నాలకు ఉక్రెయిన్ దాడులు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
ఉక్రెయిన్ దాడులు ట్రంప్‌తో పాటు మస్క్ ఆగ్రహానికి గురి చేసింది. ట్రంప్ ప్రభుత్వంలో కీలక సలహాదారుడిగా, డీఓజీఈ బాధ్యతలు నిర్వర్తించిన మస్క్.. ట్రంప్ ఆలోచనలతో పూర్తిగా ఏకీభవించారు. ఉక్రెయిన్ సైన్యం డ్రోన్లను నడిపించడానికి, కమ్యూనికేషన్‌కు అంతా మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ నెట్‌వర్క్‌పైనే పూర్తిగా ఆధారపడింది. ట్రంప్ హెచ్చరికలను లెక్కచేయకుండా ఉక్రెయిన్ దాడులు కొనసాగించడంతో, జెలెన్‌స్కీ హద్దుమీరుతున్నారంటూ మస్క్ బహిరంగంగానే మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే, ఉక్రెయిన్‌ను కట్టడి చేసేందుకు ట్రంప్ ఆలోచనకు రూపమిస్తూ.. మస్క్ తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగాన్ని పరిమితం చేసినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఉక్రెయిన్ ఆందోళన..
స్టార్‌లింక్ సేవలను పరిమితం చేయడం వల్ల తమ రక్షణ చర్యలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, స్టార్‌లింక్ సేవల విషయంలో నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం ఆ సంస్థకే ఉందని అమెరికా రక్షణ మంత్రి పేర్కొనడం విశేషం.
ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టడంతో.. తీవ్ర గాయాలతో రెండు కాళ్లు కోల్పోయిన ఎంపీ!


