మరో రెండేళ్లలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
మధ్యంతర ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై మొదలైన చర్చ
రేసులో ముందంజలో ఉన్న మార్కో రూబియో, రో ఖన్నా, పీట్ హెగ్సెత్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ప్రజలు తిరస్కరించారు. ఆయన పరిపాలన ఎంతమాత్రం నచ్చలేదని తేల్చిచెప్పేశారు. ట్రంప్‌పై సాధారణ ప్రజానీకంలోనే కాకుండా సొంత పార్టీలోనూ అసంతృప్తి రగులుతోంది. ఒంటెత్తు పోకడలతో పార్టీకి తలవంపులు తీసుకొచ్చారని రిపబ్లికన్ నేతలు మండిపడుతున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి 2028 జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు మళ్లింది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ వారసుడిగా పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో రో ఖన్నా, మార్కో రూబియో, పీట్ హెగ్సెత్ పేర్లపై ఎక్కువగా చర్చ సాగుతోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రూబియో తదుపరి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు రాజీనామా చేయవచ్చని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, రూబియో ఆ వార్తలను కొట్టిపారేశారు. ట్రంప్ హయాంలో తన పదవీకాలం ముగిసే వరకు కొనసాగుతానని తేల్చిచెప్పారు. ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు.
కుటుంబంతో కలిసి నిర్ణయం తీసుకుంటా: ఖన్నా
భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నాకు మద్దతు కూడగట్టేందుకు ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారు. మాజీ కాంగ్రెస్ సభ్యుడు జమాల్ బోమన్, వ్యూహకర్త నోమికీ కాన్‌స్ట్ కలిసి ‘రన్ రో’అనే ప్రచార బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం దాతల నుంచి నిధులు సేకరించి, ఖన్నా అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టడం ప్రారంభిస్తుంది.
అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాన్ని ప్రగతిశీల ప్రజాకర్షక దృక్పథంతో రూపొందించేలా ప్రయత్నిస్తున్నామని కాన్‌స్ట్ చెప్పారు. రో ఖన్నా అభ్యర్థిత్వానికి సవాళ్లు లేకపోలేదు. ఇప్పటివరకు ప్రతినిధుల సభ(హౌస్) నుంచి నేరుగా అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడు జేమ్స్ గార్‌ఫీల్డ్ మాత్రమే. ఆయన 1880లో విజయం సాధించారు. రో ఖన్నా ఐదోసారి చట్టసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైళ్లను బయటపెట్టడం, ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించడానికి చొరవ చూపడం వంటి కారణాలతో పలుమార్లు వార్తల్లో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయాలా? లేక వేరొకరికి మద్దతు ఇవ్వాలా? అనేది సెలవుల తర్వాత తన కుటుంబంతో కలిసి నిర్ణయించుకుంటానని ఖన్నా ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన 2020లో బెర్నీ శాండర్స్ ప్రచారానికి సహకరించారు. అమెరికాలో ప్రగతిశీలవాదులు అభిమానించే నాయకుడు రో ఖన్నా.
హెగ్సెత్, రూబియోను తప్పించడం లేదు: వైట్‌హౌస్
రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన తన అభీష్టాన్ని ఇప్పటిదాకా బహిరంగంగా వ్యక్తంచేయలేదు. మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత తన మంత్రివర్గంలో మార్పులు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తమ పదవులకు రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, ఈ అంశాన్ని వైట్‌హౌస్ ఖండించింది. రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణమని ఆరోపణలు ఉన్నాయి.
ఆయనను అభిశంసించాలని, పదవి నుంచి తప్పించాలని రిపబ్లికన్ పార్టీలో కొందరు డిమాండ్ చేస్తున్నారు. పీట్ హెగ్సెత్ తన పనితీరును సమర్థించుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తాము సమర్థవంతంగా పనిచేస్తున్నందుకే తమపై మాటల దాడి జరుగుతోందని ఆరోపించారు. ప్రత్యర్థుల ప్రయత్నాలు ఫలించబోవని, తాము వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థులుగా రవాణా శాఖ మాజీ సెక్రెటరీ పీట్ బుట్టిగీగ్, జార్జియా సెనేటర్ రాఫెల్ వార్నాక్, అరిజోనా సెనేటర్ రూబెన్ గల్లెగో, కనెక్టికట్ సెనేటర్ క్రిస్ మర్ఫీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.


