ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి బిగ్‌ స్కెచ్‌! | US Donald Trump Sensational Comments on Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి బిగ్‌ స్కెచ్‌!

Nov 7 2026 7:41 AM | Updated on Nov 7 2026 7:46 AM

US Donald Trump Sensational Comments on Iran

వాషింగ్టన్‌: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడేందుకు అమెరికా సిద్ధమవుతోందా? అణ్వాయుధాల పేరుతో ఇప్పటికే రెండుసార్లు దాడులు చేసినా.. టెహ్రాన్ అణు ముప్పు పూర్తిగా తొలగలేదా? ఇరాన్‌ను నేను అడ్డుకోకపోతే ఇజ్రాయెల్‌తో పాటు యావత్ మధ్యప్రాచ్యం ఈరోజు ఉండేవే కావంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు వైట్‌హౌస్‌లో వరుస భద్రతా సమావేశాలు, అమెరికా సైనిక దళాల సన్నాహాలు.. మరో యుద్ధానికి సంకేతాలిస్తున్నాయా? అసలు ఇరాన్ అణు కార్యక్రమం పరిస్థితి ఏమిటి? అమెరికా దాడులతో అణు ముప్పు నిజంగానే తొలగిపోయిందా? అనే చర్చ నడుస్తోంది.

ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా తన ప్రభుత్వం అడ్డుకుందని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్బంగా ట్రంప్‌..‘ఇరాన్ వద్ద అణ్వాయుధం లేకుండా నేను అడ్డుకోకపోతే ఇజ్రాయెల్‌తో పాటు మొత్తం మధ్యప్రాచ్యం ఈరోజు ఉండేవి కావు. ఈ విషయం ఎవరూ చెప్పడానికి ఇష్టపడటం లేదు. కానీ అందరికీ తెలుసు!’ అంటూ పోస్టు చేశారు. కాగా, 2025లో, 2026లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌లోని కీలక అణు, సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించాయి. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ప్రకటించాయి. అయితే ఈ దాడులతో ఇరాన్ అణు కార్యక్రమం ఎంతమేర దెబ్బతిన్నదన్నది ఇప్పటికీ స్పష్టంగా లేదు. అక్టోబర్‌లో విడుదలైన అమెరికా కాంగ్రెస్ పరిశోధనా విభాగం నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

ఇరాన్ వద్ద ఇంకా 200 కిలోల యురేనియం?
ఇరాన్ అణు కార్యక్రమంపై ఆందోళనకు ప్రధాన కారణం అక్కడ ఉన్న యురేనియం నిల్వలు. రాయిటర్స్ అక్టోబర్ విశ్లేషణ ప్రకారం, ఇస్ఫహాన్‌లోని భూగర్భ సొరంగాల సముదాయంలో 60 శాతం వరకు శుద్ధి చేసిన 200 కిలోగ్రాములకు పైగా యురేనియం ఉండవచ్చని IAEA అంచనా వేస్తోంది. అణ్వాయుధాల తయారీకి సాధారణంగా దాదాపు 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరమవుతుంది. అయితే 60 శాతం స్థాయిలో ఉన్న యురేనియంను మరింత శుద్ధి చేసే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా ఆందోళన కొనసాగుతోంది. దీనికి తోడు ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల అనంతరం అక్కడి యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్‌ల పూర్తి వివరాలనుIAEA ధ్రువీకరించలేకపోతోంది.

ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందా?
ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. ఇరాన్ అణుబాంబు తయారు చేసిందని నిర్ధారించే ఆధారాలు లేవు. ఇరాన్ కూడా తన అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమేనని చెబుతోంది. 2026లో అమెరికా అంచనాలను ఉటంకిస్తూ కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం, ఇరాన్ 2003లో తన అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఆ తర్వాత క్రమబద్ధమైన అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించినట్లు నిర్ధారిత ఆధారాలు లేవని పేర్కొంది. అంటే ఇరాన్ వద్ద అణుబాంబు ఉందని చెప్పడానికి ఆధారాలు లేవు. అదే సమయంలో దాని వద్ద ఉన్న యురేనియం నిల్వలు, అణు సామర్థ్యంపై సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి.

మరో యుద్ధానికి ట్రంప్ సంకేతాలు?
ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక చర్చలు జరుపుతోంది. బుధవారం, గురువారం వైట్‌హౌస్‌లో జాతీయ భద్రతా అధికారులతో సమావేశాలు జరిగినట్లు ఫాక్స్ న్యూస్‌కు అమెరికా అధికారులు వెల్లడించారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తదుపరి దాడులకు సంబంధించిన సన్నాహాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని దాడులు చేపట్టాలా వద్దా అనే విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని ట్రంప్ వెల్లడించారు. అయితే పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఇప్పటివరకు అధికారిక ఆదేశాలు జారీ కాలేదు.

ఇదీ చదవండి: ట్రంప్‌ వారసుడు ఎవరో? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement