బీజింగ్ : ప్రముఖ చైనీస్-కెనడియన్ విద్యావేత్త, చైనా నోస్ట్రాడామస్‌గా పేరొందిన జియాంగ్ జుక్సిన్ సంచలన జోస్యం చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ముచ్చటగా మూడోసారి అమెరికా అధ్యక్షుడవుతారని అన్నారు. ‘ప్రిడిక్టివ్ హిస్టరీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ గేమ్ థియరీ ఆధారంగా జియోపాలిటికల్ విశ్లేషణలు చేసే ఆయన, ప్రాచీన గ్రీకు చరిత్రను ఆధారం చేసుకుని భవిష్యత్తుపై పలు అంచనాలను వెలువరించారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు కేవలం వైమానిక దాడితో ముగియవని, అమెరికా తప్పనిసరిగా భూతల దాడులు చేపట్టాల్సి వస్తుందని చెప్పారు. ఈ యుద్ధం ఏళ్ల తరబడి సాగి అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీస్తుందని హెచ్చరించారు. యుద్ధం కారణంగా అమెరికా ప్రభుత్వం తప్పనిసరి సైనిక సేవలను తిరిగి ప్రవేశపెట్టేలా చట్టపరమైన సన్నాహాలు చేస్తుందని, దీనివల్ల యువత సైన్యంలో చేరాల్సిన పరిస్థితి వస్తుందని అంచనా వేశారు.
ఆర్థిక ఇబ్బందులు, సైనిక విధింపులు, కఠినమైన చట్టాల అమలు కారణంగా అమెరికాలో రెండో అంతర్గత యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, దేశంలో నిరసనలు మిన్నంటుతాయని పేర్కొన్నారు. ప్రపంచ శక్తి వనరుల రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయాలు ఏర్పడితే, చమురు, గ్యాస్, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని జియాంగ్ తెలిపారు. దీనివల్ల సరఫరా గొలుసు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత, తీవ్రమైన ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని హెచ్చరించారు.
దేశంలో అంతర్గత భద్రతను కాపాడుకునే పేరుతో అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారాలు మరింత విస్తరిస్తాయని, ప్రధాన నగరాల్లో నేషనల్ గార్డ్ బలగాల మోహరింపు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవిని చేపడతారని తాను నమ్ముతున్నట్లు జియాంగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యే అవకాశం లేదు. కానీ ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు.కానీ, జియాంగ్ మాత్రం రాజ్యాంగంలోని ఒక ఆసక్తికరమైన లొసుగును ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు.
ట్రంప్ భవిష్యత్తులో అమెరికా వైస్ ప్రెసిడెంట్ (ఉపాధ్యక్షుడు)గా పోటీ చేసి గెలుపొందుతారు. ఆ తర్వాత అప్పటి అధ్యక్షుడు రాజీనామా చేస్తే, రాజ్యాంగ ప్రకారం ఉపాధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆటోమేటిక్‌గా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. ఇలా ట్రంప్ నేరుగా ఎన్నిక కాకుండానే మూడోసారి దేశానికి అధ్యక్షుడు అవుతారని జియాంగ్ అంచనా వేశారు. ట్రంప్, ఆయన మిత్రపక్షాలు కూడా గతంలో ఈ విధమైన లొసుగుల అవకాశాన్ని పదేపదే ప్రస్తావించడంతో జియాంగ్ విశ్లేషణ ప్రాధాన్యత సంతరించుకుంది.
👉ఇదీ చదవండి: కెనడాతో ట్రంప్ ట్రేడ్ వార్‌లో మరో సంచలనం


