పీఏ-34 పైపర్ విమానం (5 సీట్లది) గ్రేట్ హార్బర్ కే నుంచి మయామి ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఆండ్రోస్ ద్వీపానికి 13 మైళ్ల పశ్చిమాన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. అందులో మారియో లామర్ (80) విమానాన్ని నడుపుతున్నారు. ఆయనతో పాటు భార్య లిల్లీ (79), మనవళ్లు క్రిస్టియన్ సోసా (22), సోఫీ సోసా (28) ప్రయాణిస్తున్నారు.
విమాన గమనాన్ని తెలిపే సమాచారం ప్రకారం.. 3 నిమిషాల్లో విమానం ఎత్తు 10,000 అడుగుల నుంచి 3,700 అడుగులకు వేగంగా పడిపోయింది. ఆ తర్వాత విమానం అదృశ్యమైంది. బహామాస్ అధికారులు, అమెరికా కోస్ట్ గార్డ్ సమన్వయంతో చేపట్టిన గాలింపు, రక్షణ చర్యలను ఆ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ ఘటనపై తాజాగా లభించిన సమాచారంలో.. విమానం ఎన్212ఎంఎల్ అనే టెయిల్ నంబర్‌తో ఉన్న పీఏ-34 పైపర్ విమానమని బహామాస్ పోలీసులు తెలిపారు. ఇది గ్రేట్ హార్బర్ కే నుంచి సోమవారం ఉదయం బయలుదేరింది. ఆండ్రోస్ ద్వీపానికి పశ్చిమాన సుమారు 13 మైళ్ల దూరంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. విమానం సముద్రంలో కూలిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మారియో లామర్‌కు 40 ఏళ్లకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. కుటుంబం చాలాకాలంగా గ్రేట్ హార్బర్ కేలోని తమ సెలవుల ఇంటికి వస్తూ వెళ్తుండేది. విమానం అదృశ్యమయ్యే ముందు దాని గమనంలో వేగం మారుతూ కనిపించిందని, కొంతసేపు చుట్టూ తిరిగిన తర్వాత రాడార్ నుంచి కనిపించకుండా పోయిందని విమాన గమన సమాచారంలో వెల్లడైంది. మారియో బంధువు సిల్వియా లారీయూ ప్రజలను సాయం చేయాలని కోరారు. అమెరికా కోస్ట్ గార్డ్ హెచ్‌సీ-144 ఓషన్ సెంట్రీ విమానాన్ని గాలింపు చర్యల్లోకి పంపింది.


