అందమైన ప్రపంచం.. ఆకర్షణీయమైన అవకాశాలు.. మోడలింగ్ రంగంలో రాణించాలనే కలలు! కానీ కొందరు యువతుల జీవితాల్లో ఇవే చీకటి అధ్యాయాలుగా మారాయి. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ మోడలింగ్ రంగాన్ని అడ్డుపెట్టుకుని యువతులను ఎలా వలలో వేసుకున్నాడో తాజాగా బీబీసీ పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడికి మోడల్ ఏజెన్సీలు కూడా సహకరించాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఉజ్బెకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చిన నెల రోజులకే రోసా (పేరు మార్చాం) అనే 18 ఏళ్ల యువతిని ఎంసీ2 మోడల్ మేనేజ్‌మెంట్ సంస్థ ఫ్లోరిడాలోని ఎప్‌స్టీన్ బీచ్ హౌస్‌కు ఫొటోషూట్‌ల కోసం పంపించింది. 2009లో ఈ ఘటన జరిగినప్పుడు ఎప్‌స్టీన్.. మైనర్‌పై లైంగిక నేరాలకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, రోజూ తన ఇంటి నుంచి బయటకు వెళ్లి పనిచేసేందుకు అనుమతి ఉండేది. తనను రక్షించాల్సిన ఏజెన్సీనే ప్రమాదంలోకి నెట్టిందని రోసా ఆరోపించింది.
తెలిసే యువతిని ఎప్‌స్టీన్ వద్దకు పంపించారా?
ఈ ఫొటోషూట్‌ల తర్వాత ఎప్‌స్టీన్ తనను వ్యక్తిగత సహాయకురాలిగా నియమించుకున్నాడని, అనంతరం పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని రోసా తెలిపింది. అప్పట్లో ఎంసీ2 అమెరికా విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న జెఫ్ ఫుల్లర్‌కు తాను ఎక్కడికి వెళ్తున్నానో పూర్తిగా తెలుసని ఆరోపించింది.
అలాగే, తన తిరుగు ప్రయాణ విమాన టికెట్‌ను కూడా ఫుల్లరే బుక్ చేసినట్లు ఆధారాలు చూపించింది. ప్రస్తుతం అతడు ‘ది సోర్స్ మోడల్స్’ అనే మరో ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. అయితే, తనకు రోసాపై జరుగుతున్న దాడుల గురించి తెలియదని గతంలో చెప్పిన ఫుల్లర్.. ప్రస్తుత తాజా ఆరోపణలపై స్పందించలేదు.
34 మంది యువతుల పరిచయానికి యత్నం!
అమెరికా న్యాయశాఖ (డీఓజే) విడుదల చేసిన పత్రాలను పరిశీలించగా.. ఎంసీ2కు చెందిన 10 మంది మోడల్స్ ఎప్‌స్టీన్‌ను కలిసినట్లుగానూ, అతడితో సంప్రదింపులు జరిపినట్లు బీబీసీ గుర్తించింది.
2005లో ఎప్‌స్టీన్ ఈ ఏజెన్సీకి 10 లక్షల డాలర్లు ఇచ్చినట్లు కూడా పత్రాల్లో ఉంది. మరోవైపు, ఎప్‌స్టీన్ కోసం 34 మంది మహిళలను పరిచయం చేసేందుకు మాజీ మోడల్ ఏజెంట్ రామ్సే ఎల్కోలీ ప్రయత్నించినట్లు పరిశోధనలో తేలింది. వారిలో 18 ఏళ్ల విద్యార్థిని కూడా ఉండటం గమనార్హం. అయితే, తనకు ఎలాంటి అక్రమ కార్యకలాపాల గురించి తెలియదని ఎల్కోలీ ఆరోపణలను ఖండించాడు.
రెండేళ్లపాటు లైంగిక వేధింపులు!
ఇదే తరహాలో మరో మోడల్ సిమోనా (పేరు మార్చాం) కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. తూర్పు యూరప్‌కు చెందిన ఆమె 20 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు ఎప్‌స్టీన్ తనకు నెక్స్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి ఫెయిత్ కేట్స్‌ను పరిచయం చేస్తానని చెప్పాడని తెలిపింది.
దీంతో కేట్స్ తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని సూచించారని, వైద్యుడి వివరాలను ఎప్‌స్టీన్‌కు పంపించారని ఆరోపించింది. ఆ తర్వాత ఎప్‌స్టీన్ తనను మోడలింగ్‌కు దూరం చేసి సహాయకురాలిగా నియమించుకున్నాడని, దాదాపు రెండేళ్లపాటు అత్యాచారం చేస్తూ తన జీవితాన్ని నియంత్రించాడని వెల్లడించింది. అతడు తనపై 200కు పైగా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది.
మోడల్ ఏజెన్సీలే.. యువతులకు, లైంగిక దోపిడీకి పాల్పడే వ్యక్తులకు మధ్య అనుసంధానంగా మారుతున్నాయని మోడల్ అలయన్స్ వ్యవస్థాపకురాలు సారా జిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఎప్‌స్టీన్ బాధితుల తరఫు న్యాయవాది సిగ్రిడ్ మెక్‌కాలీ మాట్లాడుతూ.. అతడి వద్ద పనిచేసిన మహిళా సహాయకులు కూడా బెదిరింపుల మధ్య బతికారని తెలిపారు.
కాగా, ఫెయిత్ కేట్స్ తరఫు న్యాయవాదులు ఎప్‌స్టీన్ ఆమెను తప్పుదోవ పట్టించాడని, అతడి నిజస్వరూపం తెలిసి ఉంటే సంబంధాలు కొనసాగించేవారు కాదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ రాష్ట్ర సెనేటర్ జెల్నోర్ మైరీ.. ఎప్‌స్టీన్‌కు సహకరించినవారిపై చర్యలు తీసుకునేలా కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్‌స్టీన్ అకృత్యాల గురించి తెలిసి కూడా యువతులను అతడి వద్దకు పంపించినవారిపై చర్యలు తీసుకునేలా పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించాలన్నది దీని ఉద్దేశం. మరోవైపు, తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడం ద్వారా ఇతర బాధితుల్లో ధైర్యం నింపాలని రోసా భావిస్తోంది. భయంతో మౌనంగా ఉండకుండా తమ అనుభవాలను బయటపెట్టాలని బాధిత మహిళలకు పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: రియాద్‌పై హౌతీల దాడి.. సౌదీలో హై అలర్ట్!


