పుతిన్‌ ఫేవర్‌గా అమెరికా ప్లాన్‌.. అసలు కథ ముందుందా? | US Plan Favors Putin Is the Bigger Ukraine-Russia Story Yet to Unfold | Sakshi
Sakshi News home page

పుతిన్‌ ఫేవర్‌గా అమెరికా ప్లాన్‌.. అసలు కథ ముందుందా?

Nov 15 2026 9:19 AM | Updated on Nov 15 2026 9:19 AM

US Plan Favors Putin Is the Bigger Ukraine-Russia Story Yet to Unfold

మాస్కో: యుద్ధం ఆపేందుకు భూభాగాన్ని బేరం పెట్టాలా? ఒకవైపు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం.. మరోవైపు రష్యాకు కావాల్సిన డాన్‌బాస్‌ ప్రాంతం.. ఈ రెండింటినీ ముడిపెడుతూ అమెరికా చేసిన ప్రతిపాదన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు జరుగుతున్న చర్చల్లో వాషింగ్టన్‌ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఉక్రెయిన్‌ నాటోలో చేరాలంటే తూర్పు ప్రాంతంలోని డాన్‌బాస్‌ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉందా? అని అమెరికా ప్రతినిధులు ప్రశ్నించినట్లు అధ్యక్షుడు వొలోడిమిర్‌ జెలెన్‌స్కీ వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనతో రష్యాకు భూభాగం పరంగా లాభం ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్‌ నాటోలో చేరితే అది మాస్కోకు మరో వ్యూహాత్మక సవాలుగా మారే అవకాశం ఉంది.

రష్యాకు లాభమా.. నష్టమా?
డాన్‌బాస్‌ ప్రాంతంపై రష్యా మొదటి నుంచీ కన్నేసింది. డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలతో కూడిన ఈ భూభాగంపై పూర్తి నియంత్రణ సాధించడం పుతిన్‌ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతాల నుంచి అక్కడి సైన్యం వైదొలిగితే.. రష్యాకు కీలకమైన భూభాగం దక్కుతుంది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో తన సైనిక ఆధిపత్యం పెంచుకోవచ్చు. ఇప్పటికే ఆక్రమించిన ప్రాంతాలను అనుసంధానించుకోవడంతోపాటు, యుద్ధంలో తాను ఆశించిన లక్ష్యాల్లో కీలకమైనదాన్ని సాధించానని పుతిన్‌ ప్రకటించుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ప్రతిపాదనలో రష్యాకు మరో చిక్కు కూడా ఉంది. డాన్‌బాస్‌ను వదులుకున్న తర్వాత ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం లభిస్తే.. రష్యా సరిహద్దుల్లో నాటో కూటమి ఉనికి మరింత బలపడుతుంది. ఉక్రెయిన్‌కు నాటో భద్రతా హామీలు లభిస్తే భవిష్యత్తులో రష్యా సైనిక చర్యలకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకే భూభాగం దక్కడం ఒకవైపు లాభమైతే.. ఉక్రెయిన్‌ నాటోలో చేరడం మరోవైపు రష్యాకు వ్యూహాత్మక నష్టంగా మారవచ్చు.

పుతిన్‌ స్పందన ఏంటి?
ఈ ప్రతిపాదనపై పుతిన్‌ నుంచి ఇప్పటివరకు బహిరంగంగా స్పష్టమైన అంగీకారం కానీ, తిరస్కారం కానీ వెలువడలేదు. అయితే ఉక్రెయిన్‌ నాటోలో చేరడం రష్యాకు మొదటి నుంచీ అంగీకారం కాని అంశం. నాటో విస్తరణను తమ దేశ భద్రతకు ముప్పుగా పుతిన్‌ పలుమార్లు అభివర్ణించారు. మరోవైపు డాన్‌బాస్‌లో ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను కూడా వదులుకోవాలని మాస్కో పట్టుబడుతోంది. అంటే అమెరికా ప్రతిపాదనలో రష్యా కోరుకుంటున్న భూభాగం అంశం ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పించడాన్ని పుతిన్‌ అంగీకరిస్తారా? అన్నది కీలక ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. నవంబర్‌ 12న అమెరికా ప్రతినిధులు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌ మాస్కోలో పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు, భద్రతా వ్యవస్థపై చర్చించారు. అయితే ఆ సమావేశం అనంతరం డాన్‌బాస్‌-నాటో ప్రతిపాదనపై పుతిన్‌ నిర్దిష్టంగా ఏం చెప్పారన్నది వెల్లడికాలేదు. క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాత్రం యూరప్‌ దేశాలు శాంతి ప్రక్రియకు నిజంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయో లేదో తెలుసుకున్న తర్వాతే వాటిని చర్చల్లో భాగం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు.. 
మరోవైపు తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించేందుకు సిద్ధంగా లేమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అయితే పటిష్టమైన భద్రతా హామీలు, బలమైన సైనిక వ్యవస్థను కొనసాగించేందుకు నిధులు, యుద్ధానంతర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం వంటి అంశాలతో సమగ్ర ఒప్పందం కుదిరితే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు సిద్ధమని తెలిపారు. అంతేకాదు.. ఉక్రెయిన్‌ తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా డిమాండ్‌ను కూడా వ్యతిరేకించారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పించడం అమెరికా ఒక్కటే నిర్ణయించగలిగే విషయం కాదు. కూటమిలోని సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డాన్‌బాస్‌ కోసం పుతిన్‌ నాటో సభ్యత్వానికి అంగీకరిస్తారా? లేక తన పాత డిమాండ్లకే కట్టుబడి ఉంటారా? అన్నది రాబోయే చర్చల్లో తేలనుంది.

ఇదీ చదవండి: జేబులో చిల్లిగవ్వ లేదు.. పాక్‌ సంచలన ప్రకటన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement