ఆకాశంలోకి ఫ్లాష్ కొట్టు.. | NASA: Voyager 1 About To Be A Full Day Away At The Speed Of Light | Sakshi
Sakshi News home page

ఆకాశంలోకి ఫ్లాష్ కొట్టు..

Nov 15 2026 12:13 PM | Updated on Nov 15 2026 12:25 PM

NASA: Voyager 1 About To Be A Full Day Away At The Speed Of Light

18న భూమి నుంచి 

‘కాంతి రోజు’ దూరంలో వ్యోమనౌక

భూమి నుంచి శుభాకాంక్షలు చెబుదామా!

భారతీయ కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3:46 గంటలకు (ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం ఉదయం 5:16 గంటలకు) విశ్వంలో మహాద్భుత ఘట్టం సాక్షాత్కరించబోతోంది. ఓ మానవ నిర్మిత వస్తువు ‘కాంతి రోజు’ రికార్డు సాధించబోతోంది. ఏమిటీ ‘కాంతి రోజు’ అంటారా? కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరం. ఇది 1,609 కోట్ల మైళ్లు లేదా 2,592 కోట్ల కిలోమీటర్లతో సమానం. ఈ దూరాన్ని ‘వోయేజర్-1’ అంతరిక్ష నౌక అధిగమించబోతోంది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1977 సెప్టెంబరు 5న ‘వోయేజర్-1’ను  ప్రయోగించింది. 49 ఏళ్లయినా అలుపెరగకుండా అనంత విశ్వ లోతుల్లో అది ఇప్పటికీ గంటకు 38 వేల మైళ్ల వేగంతో ముందుకు సాగుతూనే ఉంది. సందేశాలు పంపుతూ భూమిని పలుకరిస్తూనే ఉంది. ఒకవేళ గ్రహాంతర జీవులు ఏవైనా తారసపడితే... ‘హలో... భూగ్రహం పిల్లలమైన మా నుంచి’ అంటూ మన మానవుల గురించి వారికి తెలియజేప్పేందుకు... 55 భాషల్లో శుభాకాంక్షలను పొదిగిన ‘గోల్డెన్ రికార్డు’ను ‘వోయేజర్-1’ వ్యోమనౌకలో అమర్చారు.

ఇదీ చదవండి: వోయేజర్-1… ‘కాంతి రోజు’!

‘కాంతి రోజు’ను ‘వోయేజర్-1’ అధిగమిస్తున్న తరుణాన్ని పురస్కరించుకుని దాన్ని వేడుకగా నిర్వహించేందుకు, వ్యోమనౌకకు దీపాంజలి ఘటించేందుకు యావత్ మానవాళికి నాసా ఆహ్వానం పలుకుతోంది. ఎల్లుండి మంగళవారం సూర్యాస్తమయం అనంతరం ఆకాశంలోకి టార్చిలైట్లు లేదా సెల్ ఫోన్ లైట్ల వెలుగులను ఫ్లాష్ చేయాలని కోరింది. ‘వోయేజర్-1’కు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ టూల్ ను ప్రజలు వినియోగించవచ్చు. లేదా ‘వోయేజర్’ కాల్ సైన్ V-G-R అక్షరాలను ‘మోర్స్ కోడ్’లో ఆకాశంలోకి సింపుల్ లైటుగా ఫ్లాష్ చేయవచ్చు.

(Vకి 3 డాట్స్, ఒక డాష్. Gకి 2 డాషెస్, ఒక డాట్. Rకు ఒక డాట్, ఒక డాష్, ఒక డాట్. డాట్ కోసం ఒక సెకను కంటే తక్కువ కాలం లైట్ ఫ్లాష్ చేయాలి. డాష్ కోసం ఒక సెకను పాటు లైట్ ఫ్లాష్ చేయాలి. అలాగే డాట్స్, డాషెస్ మధ్య స్వల్ప విరామం ఇవ్వాలి. ప్రతి అక్షరానికి మధ్య ఒక సెకను విరామం ఉండాలి). మరిక ఆలస్యమెందుకు? బహుదూరపు బాటసారి ‘వోయేజర్-1’కు గ్రీటింగ్స్ చెప్పేందుకు సిద్ధమవండి!
- జమ్ముల శ్రీకాంత్ 
(Credits: AviationCircle, SpaceScience)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement