బోధనొక పవిత్ర కర్తవ్యం | Draupadi Murmu at National Teachers Awards ceremony | Sakshi
Sakshi News home page

బోధనొక పవిత్ర కర్తవ్యం

Sep 6 2026 4:18 AM | Updated on Sep 6 2026 4:18 AM

Draupadi Murmu at National Teachers Awards ceremony

మార్కులు కాదు.. విద్యార్థుల్లో సహజ నైపుణ్యాలను గుర్తించాలి 

జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 

తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురికి దక్కిన గౌరవం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బోధన అనేది కేవలం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదని, అదొక భావిభారత పౌరుల మనో వికాసానికి పునాది వేసే అత్యంత పవిత్రమైన కర్తవ్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాలయాలకు తీసుకొచ్చి ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టినప్పుడు, ఉపాధ్యాయులు సొంత బిడ్డల్లా భావించి రక్షణ, ఉన్నతిని చూసుకుంటారని వారు నమ్ముతారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే గురువుల ప్రధాన ధర్మమని హితోపదేశం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో శనివారం రాష్ట్రపతి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా 82 మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి ఈ గౌరవం దక్కింది. హైదరాబాద్‌ ఐఐటీ కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ కీర్తి చంద్ర సాహూ, తెలంగాణలో కామారెడ్డి జిల్లా గాంధారిలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ బొంపెల్లి భవాని, ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని గుషిణి గ్రామపంచాయతీ పరిధిలోని చినమల్లుపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రాజేశ్‌ కౌలూరికి ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డు గ్రహీతల్లో ఒకరైన జె.ప్రకాశరావు తెలుగు మూలాలున్న ఉపాధ్యాయుడు. అండమాన్‌ దీవుల్లోని మాయాబందర్‌ ప్రాంతంలో స్థిరపడిన తెలుగు, బహుభాషా కుటుంబాల విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు.  

ఉపాధ్యాయుల ధోరణి మారాలి 
అవార్డు గ్రహీతలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విద్యార్థులపైనే దృష్టి పెట్టే ఉపాధ్యాయుల ధోరణి మారాలని సూచించారు. అకడమిక్‌ ప్రతిభ అనేది విద్యార్థి బహుముఖ ప్రజ్ఞలో ఒక భాగం మాత్రమేనన్నారు. ఒక విద్యార్థి క్రీడల్లో రాణించవచ్చు, మరొకరికి నాయకత్వ లక్షణాలు ఉండవచ్చు, ఇంకొకరికి సామాజిక సేవపై ఆసక్తి ఉండవచ్చు.. ఇలా ప్రతి చిన్నారిలోని సహజ ప్రతిభను గుర్తించి వెలికితీయడమే ఉపాధ్యాయుల అసలైన బాధ్యత అని చెప్పారు. ఒక విద్యార్థి రాణించలేకపోతే ఆ లోపం కేవలం ఆ విద్యార్థిది మాత్రమే కాదని, విద్యావ్యవస్థ, ఉపాధ్యాయుల బాధ్యత కూడా అందులో ఉంటుందని తెలిపారు. విద్యార్థుల మెదళ్లలో కేవలం సమాచారాన్ని మాత్రమే నింపడం కాకుండా స్వతంత్ర ఆలోచనా శక్తిని, ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 

పర్యావరణ పరిరక్షణ, అంత్యోదయ భావన, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ‘నేషన్‌ ఫస్ట్‌’స్ఫూర్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దినప్పుడే ‘వికసిత్‌ భారత్‌’కల సాకారమవుతుందని ఉద్ఘాటించారు. బాలికల విద్య కోసం పాటుపడిన సావిత్రీబాయి ఫూలే కృషిని, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆదర్శాలను కొనియాడారు. ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌ శ్రీఅరబిందో ఇంటిగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో తాను ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రోజులను రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నేను ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు నా విద్యార్థుల నుంచి కూడా నేనెంతో నేర్చుకున్నాను. వారి నుంచి పొందిన ప్రేమాభిమానాలే నా జీవితంలో నేను సాధించిన అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా భావిస్తాను’అని ముర్ము చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement