breaking news
world map
-
50 ఏళ్ల MAPను ఎందుకు మార్చారు? మనం చూసిన వరల్డ్ మ్యాప్ నిజం కాదా?
-
నిజరూప పట దర్శనం!
మాటలు కావొచ్చు, చేతలు కావొచ్చు– ఏవీ శూన్యంనుంచి ఊడిపడవు. అనుద్దేశపూర్వకంగా, యథాలాపంగా ఏవీ ఉండవు. వాటిని ఉపయోగించేవారికి ఆ సంగతి తెలియొచ్చు... తెలియకపోవచ్చు. ఒక్కోసారి బాధితులకు కూడా అర్థం కాకపోవచ్చు. కానీ వివక్షను ఎత్తిచూపినప్పుడు సరిదిద్దుకోవటం సంస్కారం. ఈ విషయంలో వ్యక్తుల్ని కొంతవరకూ క్షమించవచ్చు. కానీ ప్రపంచ దేశాల సారథి ఐక్యరాజ్యసమితిని క్షమించగలమా? ప్రపంచ పటంలో మా ఖండాన్ని చిన్నబుచ్చుతున్నారని ఆఫ్రికా దేశాలు దశాబ్దాలుగా ఎత్తిచూపుతున్నాయి. అయినా దాన్ని సరిదిద్దుకోవటానికి దీర్ఘకాలం పట్టింది. ఎట్టకేలకు మొన్న శుక్రవారం దాన్ని సవరించుకుంది. ఏకంగా 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఒటేస్తే, ఎప్పట్లానే అమెరికా ఉలిపికట్టె ధోరణి ప్రదర్శించింది. ఎప్పుడో పదహారో శతాబ్దంనాటి మాట. భౌగోళిక పటాల రూపకర్త గెరార్డస్ మెర్కేటర్ తొలిసారి 1569లో ప్రపంచ పటాన్ని రూపొందించాడు. దక్షిణార్ధ గోళ దేశాలను, ముఖ్యంగా భూమధ్య రేఖ సమీప దేశాలను వాటి వాస్తవ పరిమాణంకన్నా తక్కువగా చూపాడాయన. అప్పటికున్న పరిజ్ఞానం పరిమితుల్లో అలా చేశాడని సరిపెట్టుకోవటానికి లేదు. అదే నిజమైతే ఉత్తరార్ధ గోళ దేశాలనూ, ధ్రువాలకు సమీపంలో ఉన్నవాటినీ పెంచి ఎలా చూపగలిగాడు? ఏమైతేనేం... ప్రపంచపటం ఇన్నాళ్లకు సక్రమమైంది. ఖండాలను వాటి నిష్పత్తికి అనుగుణమైన వైశాల్యాల్లో రూపొందించారు. కానీ ఆ క్రమంలో మన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను ఆ పటం చైనా, పాకిస్తాన్లకు ‘పంచిపెట్టింది’. మన విదేశాంగ శాఖ చెప్పినట్టు ఇదేమీ దేశాల హద్దుల్ని అధికారికంగా నిర్ధారించేది కాకపోవచ్చు. కానీ ఒక తప్పును సరిదిద్దుకునే క్రమంలో కొత్త తప్పుల్ని చేయరాదన్న ఇంగిత జ్ఞానం లోపించింది. అమెరికాలో కొంత భూభాగాన్ని వేరేవాళ్ల ఖాతాలో వేసి ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఊరుకునేవారా? అవతలివారిపై ఆధిక్యతాభావం మనిషి నరానరాల్లోనూ వ్యాపించిన జాడ్యం. దీనికి భౌగోళిక హద్దులేమీ లేవు. అది జాత్యహంకారంగా, వర్ణవివక్షగా, ఆర్థికంగా అధికులమనే భావనగా వ్యక్తం కావటం ఎవరికీ తెలియంది కాదు. కులాన్నిబట్టి, మతాన్నిబట్టి మేం అధికులం, అన్యులు అల్పులన్న భావన ప్రబలంగా ఉండటం మన అనుభవంలో ఉన్నదే. తెల్లతోలు ఉన్నవాళ్లు అసాధారణ మానవులు, మిగిలినవాళ్లంతా అల్పులనే భావన పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ పోలేదు. హిట్లర్ హయాంలో యూదుల్ని జర్మనీ వెంటాడి, వేటాడి హతమార్చటం వెనుకా... ఎనిమిది దశాబ్దాలపైగా పాలస్తీనాలో మారణహోమాన్ని సాగిస్తున్న అమానుష ఇజ్రాయెల్ వెనకా ఈ జాడ్యం తాలూకు ఛాయలే కనబడతాయి. అమెరికాలో కనబడే శ్వేతజాతి అహంకారం కూడా ఈ బాపతే. మనిషి అంతరాంతరాల్లో ఇలాంటివి గూడు కట్టుకున్నప్పుడు వారి వ్యవహార శైలిలో అది ప్రతిబింబించక మానదు. ఒక ప్రాంత భౌగోళిక వైశాల్యం ఎంతో చెప్పే పటాలు చూడటానికి అన్నిటికీ అతీతంగా, అలీనంగా కనబడతాయి. కానీ పటాల రూపకల్పనలో చోటుచేసుకునే రాజకీయాల గురించి 2020లో కార్నెల్ వర్సిటీ అధ్యాపకురాలు క్రిస్టిన్ లూయెన్బెర్గర్ చాలా సంగతులే చెప్పారు. దృగ్గోచరమయ్యే రాజకీయాలతో పాటు, ప్రచ్ఛన్నంగా, గుట్టుగా ఉండిపోయే రాజకీయాలు కూడా ఈ పటాల రూపకల్పనలో ఉంటాయని ఆమె అభిప్రాయం. ప్రతి పటమూ చూపవల్సినంతగా చూపుతూనే, దాచాల్సింది దాస్తుందనీ, నిర్దిష్ట సమూహం కోసమే ఇదంతా జరుగుతుందనీ క్రిస్టిన్ అంటారు. గుండ్రంగా ఉండే భూమిని చదునైన కాగితంపై చూపితే కొంత వక్రీకరణ ఎలాగూ తప్పదు. కానీ గ్రీన్‌ల్యాండ్ కన్నా 14 రెట్లు పెద్దదైన ఆఫ్రికా... దాని ముందు చిన్నబోవట మేమిటి? యూరప్, అమెరికాలు కూడా తమ వాస్తవ విస్తీర్ణంకన్నా అధికంగా కనబడ తాయెందుకు? ఆఫ్రికాతోపాటు దక్షిణ అమెరికా, భారత్‌లు చిన్నగా ఉంటాయి. కాగితాల్లో తప్పుడు గీతలు గీసి అధికులమనుకోవటం... తరగతి గదుల్లో రూపుదిద్దుకునే తరాలకు అజ్ఞానాన్ని బట్వాడా చేయటం సిగ్గుచేటు కాదా? సమితికి ఇంతకన్నా ప్రాధాన్యం గలవి చాలా ఉన్నాయని ట్రంప్ ఉవాచ. అందుకే తీర్మానాన్ని వ్యతిరేకించారట. నిజమే... ప్రాధాన్యం గలవి ఇంకా ఉన్నాయి. ఆ లెక్కలు కూడా తేలిస్తే అమెరికా వంచన మరింత తేటతెల్లమవుతుంది! -
ప్రపంచం మారిపోయింది!
అవును. మీరు చదివింది అక్షరాలా నిజం. ఎప్పుడో జీపీఎస్, లైడార్ వంటి టెక్నాలజీలేవీ లేని కాలంలో ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ మెర్కాటర్ తయారు చేసిన మ్యాప్ స్థానంలో ఐక్యరాజ్యసమితి సరికొత్త ప్రపంచ పటాన్ని అధికారికంగా ఆమోదించింది. పాత మ్యాప్‌లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియాలు వాటి వాస్తవ సైజు కంటే తక్కువగా కనిపిస్తున్నాయని, దాన్ని సరిచేస్తూ ‘ఈక్వల్ ఎర్త్’పేరుతో కొత్త మ్యాప్ తయారు చేశామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత్ సహా మొత్తం 164 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపగా అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించింది. ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. విద్య, మీడియా, అంతర్జాతీయ విధానాల్లో దేశాలకు తగిన ప్రాధా న్యం లభించాలన్నది ఈ మార్పు ఉద్దేశం. ఒకసారి ప్రపంచపటాన్ని చూడండి. ఎగువభాగంలో గ్రీన్‌ల్యాండ్.. దిగువన ఆఫ్రికా ఖండం కనిపిస్తాయి. రెండింటిలో ఏది పెద్దదంటే మీరేమంటారు? సహజంగానే గ్రీన్‌ల్యాండ్ అని సమాధానం వస్తుంది. కానీ.. దీంతోపోలిస్తే ఆఫ్రికా ఒకటి కాదు..రెండు కాదు.. 14 రెట్లు ఎక్కువ సైజుంటుంది. మెర్కాటర్ అనే మ్యాపుల తయారీదారు 1569లో సిద్ధం చేసిన మ్యాప్‌నే మనం ఇప్పటికీ వాడుతూండటం దీనికి కారణం. ఇదొక్కటే కాదు.. ఇలాంటి తేడాలు ఇంకా చాలానే ఉన్నాయి దీంట్లో. ప్రపంచాన్ని కాగితంపై చూపించడానికి చేసుకున్న ఎన్నో రాజీల్లో మెర్కాటర్ మ్యాప్ ఒకటి. భూమి గుండ్రంగా త్రీడీలో ఉంటే.. కాగితం 2డీలో ఉండటం అసలు సమస్యకు కారణం. దీన్ని సరిచేసేందుకు మ్యాప్ ప్రొజెక్షన్ పద్ధతిని ఉపయోగించారు. ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత మెర్కాటర్ ప్రొజెక్షన్లో తేడాలు వచ్చేశాయి. భూమధ్య రేఖకు దూరంగా జరుగుతున్న కొద్దీ మ్యాప్‌లోని భూభాగాల పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది. అయితే అప్పట్లో మెర్కాటర్ ఈ మ్యాపును కేవలం సముద్రయానం కోసం మాత్రమే తయారు చేశాడు. అందుకే ఆఫ్రికా విస్తీర్ణం 303.7 కోట్ల చదరపు కిలోమీటర్లయినా.. మెర్కాటర్ మ్యాప్‌లో 21.7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న గ్రీన్‌ల్యాండ్ కంటే చిన్నగా కనిపిస్తూంటుంది. అప్పట్లో సముద్రయానానికి మెర్కాటర్ మ్యాప్ బాగా పనిచేసింది కానీ.. ఈ తేడాలు అనేక ఇతర సమస్యలను తీసుకొచ్చాయి. ఈక్వల్ ఎర్త్ మ్యాప్ అవసరం ఏర్పడింది ఇందుకే. బోజన్ సావ్రిచ్, టామ్ ప్యాటర్సన్, బెర్న్‌హార్డ్ జెన్నీ అనే ముగ్గురు కార్టోగ్రాఫర్లు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’మ్యాప్‌ను రూపొందించారు. భూభాగాల విస్తీర్ణాన్ని సరిగ్గా చూపించడం ఈ ప్రొజెక్షన్ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు...లెక్కల్లో గట్టిగా ఉండటమే కాకుండా.. చూసేందుకు కూడా సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తవానికి ప్రపంచ పటం విషయంలో కొన్ని వందల ప్రొజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో మెర్కాటర్ సహా ఓ డజను మాత్రమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్లో భూభాగాల పరిమాణాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల ఎవరో పెద్ద... మిగిలిన వారు చిన్న అన్న భావన భావన ఏర్పడే అవకాశం ఉండదని మద్దతుదారుల అంచనా.ఆఫ్రికా దేశాల ఉద్యమం ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ మ్యాప్ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ఉద్యమం ఫలితంగానే సాకారమైందని చెప్పాలి. ఆఫ్రికన్ దేశం టోగో కొత్త మ్యాప్ ప్రతిపాదన చేయగా ఆఫ్రికన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. ఆఫ్రికా పరిమాణాన్ని సరిగ్గా చూపడమే కాకుండా... పాత అసమానతలను సరి చేయాలన్నది ఆఫ్రికా దేశాల ఉద్దేశం. ఇందుకు తగ్గట్టుగానే ఐరాస తీర్మానం కూడా పాఠశాలల్లో, పాఠ్యపుస్తకాల్లో మీడియా, సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈక్వల్ ఎర్త్ వంటి ప్రొజెక్షన్ల వినియోగాన్ని పెంచమని కోరుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచ పటం మారబోతుందా?.. అతిపెద్ద స్థానం ఇక ఆఫ్రికాకే!
ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది?.. ఆసియా అనే సమాధానం వినిపిస్తుంది, కనిపిస్తుంది. అయితే దానిని మార్చే ప్రయత్నాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఖండాల పరిమాణాలను మరింత వాస్తవికంగా చూపించే దిశగా ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని అమెరికా సహా ఆరు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే.. సంప్రదాయ మెర్కేటర్ ప్రొజెక్షన్ స్థానంలో ‘ఈక్వల్ ఎర్త్’ (Equal Earth) ప్రొజెక్షన్‌ను ప్రోత్సహించే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తాజాగా ఆమోదించింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఆఫ్రికా ఖండాన్ని ప్రపంచ పటంలో వాస్తవ పరిమాణం కంటే చిన్నగా చూపిస్తున్నారనే వాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 🎉Congratulations to the delegation of Togo 🇹🇬 on the adoption this morning by the #UNGA of resolution A/80/L.104, “Correct the Map”, an @_AfricanUnion initiative promoting more accurate and equitable global cartographic representation, particularly of #Africa.A significant… pic.twitter.com/oxZCbeMUTt— African Union Mission to the UN (@AfricanUnionUN) September 4, 2026ఇంతకు ముందు.. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా ఇలా విస్తీర్ణం పరంగా ఖండాలు జాబితాలో వరుసగా ఉన్నాయి. అయితే ఐరాస తెచ్చిన కొత్త పటంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా తదితర ప్రాంతాలు వాటి అసలు భౌగోళిక విస్తీర్ణానికి మరింత దగ్గరగా కనిపిస్తాయి. ప్రపంచ భూభాగాల ప్రాతినిధ్యాన్ని మరింత కచ్చితంగా, సమతూకంగా చూపించడమే ఈ తీర్మానం ఉద్దేశం.మ్యాప్‌ను చూస్తే మరోలా.. ప్రపంచ పటాలను చూస్తే ఆఫ్రికా కంటే యూరప్, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలు పెద్దవిగా కనిపించడం చాలామందిలో అపోహకు కారణమవుతోంది. వాస్తవానికి ఆసియానే ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. భూభాగ పరంగా ప్రపంచ మొత్తం భూమిలో దాదాపు మూడో వంతు ఆసియాలోనే ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఆఫ్రికా ఉంటుంది. అయితే మెర్కేటర్ వంటి పటాల్లో ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న భూభాగాలు పరిమాణం కంటే చాలా పెద్దగా కనిపిస్తాయి. దీంతో ఖండాల అసలు విస్తీర్ణాలపై ప్రజలకు తప్పుడు అంచనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.మెర్కేటర్ పటంలో ఏం సమస్య?1569లో ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్ రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్ ప్రధానంగా సముద్ర ప్రయాణాలు, నావిగేషన్ కోసం ఉపయోగపడేలా రూపొందించారు. భూమి గోళాకారంగా ఉండగా.. దానిని చదునైన పటంగా చూపించాల్సి రావడంతో ఖండాల ఆకారాలు, పరిమాణాల్లో వక్రీకరణలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భూమధ్యరేఖకు దూరంగా వెళ్లే కొద్దీ భూభాగాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తాయి. దీంతో యూరప్, ఉత్తర అమెరికా, రష్యా వంటి ప్రాంతాలు భారీగా కనిపిస్తుండగా.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాలు వాటి వాస్తవ విస్తీర్ణంతో పోలిస్తే చిన్నగా కనిపిస్తాయి. ఉదాహరణకు మెర్కేటర్ పటంలో గ్రీన్లాండ్ దాదాపు ఆఫ్రికా అంత పెద్దదిగా కనిపిస్తుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే అనేక రెట్లు పెద్దది.2018లో ‘ఈక్వల్ ఎర్త్’ఈ వక్రీకరణలను తగ్గించేందుకు కార్టోగ్రాఫర్లు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్‌ను రూపొందించారు. భూమిపై ఖండాల వాస్తవ విస్తీర్ణాల మధ్య ఉన్న నిష్పత్తిని సాధ్యమైనంత వరకు పటంలోనూ కొనసాగించడమే దీని ప్రత్యేకత. దీంతో ఆఫ్రికా వంటి ఖండాలు ప్రపంచ పటంలో తమ అసలు పరిమాణానికి దగ్గరగా కనిపిస్తాయి.అమెరికా తీవ్ర వ్యతిరేకతఅయితే ఐరాస తీర్మానంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో 16వ శతాబ్దపు పటాలపై, వాటి ద్వారా పరిహారం (reparations), ‘కాగ్నిటివ్ జస్టిస్’ను ప్రోత్సహించడంపై చర్చించడం వల్లే ఐరాస తన విశ్వసనీయతను కోల్పోతోందని అమెరికా ప్రతినిధి యరీనా ఫెరెన్సెవిచ్ విమర్శించారు.మరోవైపు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్ డస్సే మాత్రం పటాలు కేవలం భౌగోళిక చిత్రాలు మాత్రమే కాదని అన్నారు. అవి విద్యను ప్రభావితం చేస్తాయని, మన ఊహలకు రూపమిస్తాయని, ప్రపంచంపై సమష్టి అవగాహనను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. వాస్తవానికి భిన్నమైన పటాలు తరతరాలకు తప్పుడు అవగాహనను అందించే ప్రమాదం ఉందన్నారు.ఫ్రాన్స్ కూడా మెర్కేటర్కు గుడ్బైతీర్మానానికి సహ-మద్దతుదారుగా ఉన్న ఫ్రాన్స్ కూడా ఇకపై మెర్కేటర్ ప్రొజెక్షన్‌ను వదిలి కొత్త పటాన్ని ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. మెర్కేటర్ పటంలో అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాతో పోలిస్తే పెద్దగా కనిపిస్తున్నాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ అన్నారు. “పటాలను మార్చడం వల్ల ప్రపంచం మారదు. కానీ వక్రీకరించిన ప్రాతినిధ్యాన్ని సరిదిద్దడం నిజాన్ని గుర్తించే చర్య” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆఫ్రికాలోని మాజీ ఫ్రెంచ్ వలస దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిర్ణయం రావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: హవ్వా.. అబ్రహం లింకన్‌కు ఇదేం దుస్థితి? -
‘పిట్ట’ పిచ్చి పరాకాష్ఠకు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అన్ని హద్దులు దాటుతోంది. భారత ప్రభుత్వంతో గత కొన్ని నెలలుగా తలపడుతున్న ట్విట్టర్.. తాజాగా, మరోసారి కట్టుదాటి ప్రవర్తించింది. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను ప్రత్యేక దేశంగా తన వెబ్‌సైట్‌లోని ప్రపంచ చిత్రపటంలో చూపింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌లోని ‘కెరియర్ సెక్షన్’లో పోస్ట్ చేసిన ప్రపంచ పటంలో ట్విట్టర్ ఈ దుందుడుకుతనం చూపింది. ట్విట్టర్ తీరుపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తక్షణమే ట్విట్టర్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చివరకు ఆ మ్యాప్‌ను ట్విట్టర్ తొలగించింది. భారత చిత్రపటంలో మార్పులు చేయడం ట్విట్టర్‌కు ఇది తొలిసారి కాదు. గతంలో లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని చైనా దేశంలో అంతర్భాగంగా చూపింది. భారత్ తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన ఐటీ నిబంధనల అమలు విషయంలో ట్విట్టర్ కొన్నాళ్లుగా ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. కావాల్సినంత సమయం ఇచ్చినప్పటికీ భారత ఐటీ చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ట్విట్టర్‌కు భారత్‌లో చట్టబద్ధ రక్షణ కల్పించే ‘ఇంటర్మీడియరీ హోదా’ను సైతం మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తొలగించడం తెల్సిందే. దీంతో, ట్విట్టర్లో పోస్ట్ అయ్యే సంఘవ్యతిరేక అంశాలకు సంబంధించి ఆ సంస్థే నేరుగా చట్టబద్ధ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అక్టోబర్ నెలలో లేహ్‌లో జరిగిన ఒక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఆ ప్రాంతాన్ని చైనాలో భాగంగా ట్విట్టర్ తన జియోట్యాగింగ్‌లో చూపింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం కూడా ట్విట్టర్‌కు గట్టిగా హెచ్చరించింది. భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. గత నవంబర్లోనూ లేహ్‌ను లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా కాకుండా, జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రాంతంగా ట్విట్టర్ చూపింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు పంపించింది. మ్యాప్‌ల్లో తప్పులు లేకుండా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. మే 26 నుంచి నూతన ఐటీ నిబంధనల మేరకు ప్రత్యేకంగా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న, భారత్‌లోనే నివసించే గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్లను నియమించాలన్న ఆదేశాలను సైతం ట్విట్టర్ బేఖాతరు చేసింది. తాజాగా, శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను గంటపాటు స్తంభింపజేసింది. ట్విట్టర్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్తున్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమం సమయం నుంచి ట్విట్టర్, కేంద్రం మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. -
గిన్నిస్ బుక్‌లో లక్ష చదరపు అడుగుల ప్రపంచ పటం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని వైబ్రాంట్స్ ఆఫ్ కలామ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా ప్రపంచ పటం ఆకారం చుట్టూ మానవహారం నిర్వహించారు. శనివారం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 7 వేల మంది విద్యార్థులు హాజరై లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 193 దేశాలతో కూడిన ప్రపంచ చిత్రపటాన్ని వేశారు. అనంతరం విద్యార్థులు మానవహారంగా నిలబడి ధరిత్రిలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైం ఎస్పీ రాంమోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు ధ్రువ పత్రాన్ని అందజేశారు. -
లేపాక్షి ఆలయానికి మహర్దశ
లేపాక్షి : అనంతపురం జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో ఒకటైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అఖిల భారత పంచాయతీ పరషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజినేయులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అతి త్వరలో లేపాక్షికి మహర్దశ రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి శాస్త్ర, సాంకేతిక, విద్య, సాంస్కృతిక సంస్థ (యునెస్కో, ఫారిస్) తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కనున్నట్టు కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ), ప్రపంచ హెరిటేజ్ డైరెక్టర్ లూర్దుసామి హైదరాబాద్, పురావస్తు శాఖ సూపరింటెండెంట్ లూహీర్కు ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. లేపాక్షికి సంబంధించిన గొప్ప ఫొటోలు, యూనివర్సల్ వాల్యూస్, స్థలం, డ్రాయింగ్స్‌ను యునెస్కో ఫార్మాట్లో పంపాలని ఆదేశించిందని తెలిపారు. అవి పంపిన వెంటనే తుది జాబితాలో లేపాక్షి చేరుతుందని పేర్కొన్నారు. అయితే ఈనెల 3న ఢిల్లీలోని ప్రధాని కార్యాలయ కార్యదర్శి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రాకేష్తివారీకి వినతిపత్రాలు సమర్పించినట్టు ఆయన వివరించారు. -
'ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండదు'
జమ్మూ: కశ్మీర్లో అశాంతికి కారణమవుతున్న పాకిస్తాన్.. ఇదే ధోరణిని కొనసాగిస్తే ప్రపంచపటం నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అన్నారు. సాంబా జిల్లాలోని రాజిందర్ పూరా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘సర్జికల్ దాడుల తర్వాత బుద్ధి తెచ్చుకోకుండా భారత ఆర్మీ ఔట్‌పోస్టులపై దాడి చేస్తోంది. మిలిటెంట్ల చొరబాట్లకు సహకరిస్తూ.. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఇలాగే కొనసాగితే పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన నాటి పరిస్థితులు పునరావృతమవుతాయి’ అని విమర్శించారు. పాకిస్తాన్ విఫల దేశమని, జమ్మూకశ్మీర్ ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉడీ సైనిక స్థావరంపై ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా ఏకాకిని చేశారని, దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందన్నారు.


