స్థానికంగా కర్ఫ్యూ అమలు చేయండి | Curfews To Curb Rioting and Looting calls French Prime Minister sebastien Lecornu | Sakshi
Sakshi News home page

స్థానికంగా కర్ఫ్యూ అమలు చేయండి

Oct 20 2026 6:48 AM | Updated on Oct 20 2026 6:48 AM

Curfews To Curb Rioting and Looting calls French Prime Minister sebastien Lecornu

లూటీలు, దహనాల కట్టడికి నగర యంత్రాంగాలకు సూచించిన ఫ్రాన్స్‌ ప్రధాని

పారిస్‌: ప్రభుత్వ భవనాలు, వేల సంఖ్యలో వాణిజ్య సంస్థలే లక్ష్యంగా వారాంతంలో చెలరేగిన లూటీలు, దహనాల కట్టడికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. అసాంఘిక శక్తులను కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ స్థానికంగా నిషేధాజ్ఞలు, కర్ఫ్యూలను అమలు చేయాలని నగర యంత్రాంగాలను కోరింది. ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం అనంతరం ప్రధానమంత్రి సెబాస్టియెన్‌ లెకార్ను మీడియాకు ఈ విషయం తెలిపారు. 

తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘటనలు, ఆస్తుల విధ్వంసం జరిగినప్పటికీ ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం ఒక అద్భుతమని, పోలీసు అధికారుల పనితీరును లెకార్ను ఈ సందర్భంగా ప్రశంసించారు. స్థానికంగా కర్ఫ్యూ విధించాల్సిన ప్రాంతాలను గుర్తించి, ఆ సమాచారాన్ని అక్కడి యంత్రాంగాలకు అందజేస్తామన్నారు. కాగా, అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకునేందుకు అంతరంగిక శాఖ మంత్రి నూనెజ్‌ సిద్ధపడగా, అధ్యక్షుడు మేక్రాన్‌ ఆ అవసరం లేదని ఆయన్ను వారించారు. అల్లర్లకు దారి తీసిన పరిస్థితులు, నిఘా వ్యవస్థల పనితీరుపై సమీక్ష చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

హింసాత్మక ఘటనలకు చెక్‌ పెట్టేందుకు కొత్త తరహా పోలీసింగ్‌ విధానాలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న ధరలు, స్కూళ్లలో తక్కువ స్థాయి వసతులను నిరసిస్తూ శనివారం మొదలైన దహన కాండ ఆదివారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా కనీసం 3 వేల వ్యాపార సంస్థలు ధ్వంసం, దోపిడీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి 2,400 మందిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అనూహ్య విధ్వంసం చోటుచేసుకున్న మర్సెయిల్‌ నగరంలో సోమవారం రాత్రి 8 గంటల వరకు నిషేధాజ్ఞలు విధించారు. రాజధాని పారిస్‌లో సిబ్బంది విధ్వంసం జరిగిన వీధులను శుభ్రం చేయడంతోపాటు పగిలిన అద్దాలు, ఇతర శిథిలాలను తొలగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement