కుల్దీప్ యాదవ్ (PC: BCCI X)
శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ముందుగా ఊహించినట్లుగానే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యాజమాన్యం అతడితో అరంగేట్రం చేయించింది. ఈ నేపథ్యంలో కుల్దీప్‌ను ఉద్దేశపూర్వకంగానే తప్పించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఘాటుగా స్పందించాడు.
అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు
కొలంబో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. కుల్దీప్ యాదవ్ విషయంలో తమకు అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదన్నాడు. అతడు అనారోగ్యంతో ఉన్నాడని.. అందుకే శ్రీలంకతో రెండో టెస్టు ఆడటం లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘కుల్దీప్ యాదవ్ ఫిట్‌నెస్ గురించి మీరు అడిగిన ప్రశ్న అసంబద్ధమైనది.
నిజంగానే జ్వరం వచ్చింది
గాలె నుంచి బయల్దేరినపుడే అతడు వైరల్ ఫీవర్‌తో ఉన్నాడు. నిజంగానే అతడికి జ్వరం వచ్చింది. జట్టుకు స్పిన్నర్ అవసరమైన వేళ.. అతడు ఆడలేని పరిస్థితిలో ఉంటే.. యాజమాన్యానికి అతడి గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే అతడు ఆడగలిగే పరిస్థితిలో లేకుంటే.. సెలక్షన్‌కు ఎలా అందుబాటులో ఉండగలడు?
పొద్దున బాలేడు.. సాయంత్రానికి కోలుకున్నాడు
కుల్దీప్ విషయంలో మీరిలా ఆలోచించడం ఎంతమాత్రం సరికాదు. ఏదేమైనా అతడు త్వరగానే కోలుకున్నాడు. ఈరోజు సాయంత్రం (ఆదివారం) అతడిని నేరుగా కలిశాను. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. ఉదయం మాత్రం మ్యాచ్ ఆడే పరిస్థితిలో లేడు.
మరో విషయం.. తుదిజట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు లేదంటే ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే.. శ్రీలంక టాపార్డర్‌లో దాదాపు నలుగురు లెఫ్టాండర్లే ఉన్నారు. అలాంటపుడు ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించడం సరైందే కదా’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. తద్వారా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా కుల్దీప్‌ను తప్పించి.. సారాంశ్ జైన్‌ను ఆడిస్తున్నామని చెప్పకనే చెప్పాడు.
ప్రయాణ బడలిక వల్లే
ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్ గురించి బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాట్లాడుతూ.. ప్రయాణంలో అలసిపోయిన కారణంగానే అతడు రెండు రోజుల పాటు నెట్ సెషన్‌కు రాలేకపోయాడని తెలిపాడు. సితాన్షు కొటక్ మాత్రం వైరల్ ఫీవర్ అని చెప్పడం గమనార్హం.
కాగా.. గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ శ్రీలంకపై 165 పరుగుల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు కొలంబోలో ఆదివారం మొదలైంది. ఇక తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్ల బౌలింగ్‌లో 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ తీశాడు.


