మీకేం తెలుసు?.. హద్దు మీరితే బాగోదు: జైస్వాల్‌ ఫైర్‌ | Yashasvi Jaiswal Shuts Harsha Bhogle Down On Asitha Fernando Fight | Sakshi
Sakshi News home page

మీకేం తెలుసు?: హర్షా భోగ్లేకు ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్‌

Aug 24 2026 12:28 PM | Updated on Aug 24 2026 12:35 PM

Yashasvi Jaiswal Shuts Harsha Bhogle Down On Asitha Fernando Fight

PC: Sonysports X

ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లేకు టీమిండియా స్టార్‌ యశస్వి జైస్వాల్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు. ఎవరైనా సరే హద్దులు మీరితే.. వారికి తాను తప్పకుండా బుద్ధి చెప్తానని స్పష్టం చేశాడు. అసలు జరిగింది ఏమిటంటే..

కాగా టీమిండియా- శ్రీలంక మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా జైస్వాల్‌- అసిత ఫెర్నాండో మధ్య ఆదివారం వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్‌ ఇన్నింగ్స్‌లో అసిత.. 17వ ఓవర్‌ వేయగా.. రెండు, నాలుగు, ఐదో బంతులకు జైస్వాల్‌ ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయిపోయాడు.

కొట్టుకోవడమే మిగిలింది
ఈ క్రమంలో జైస్వాల్‌ మైదానం వీడుతుండగా.. ప్రతీకారం తీర్చుకున్నా అన్నట్లుగా అసిత ఏదో అన్నాడు. ఇందుకు ఘాటుగా బదులిచ్చిన జైసూ.. అతడి మీదకు వెళ్లాడు. అసిత కళ్లల్లోకి కళ్లు పెట్టి కోపంగా చూసిన జైస్వాల్‌.. హెల్మెట్‌తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్‌గా మారుతోందని గ్రహించిన లంక కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ వచ్చి ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశాడు.

ఆటలో సహజమే
ఈ ఘటనపై ఇరుజట్ల కోచ్‌లు స్పందిస్తూ.. టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య ఇలాంటి ఘటనలు సహజమేనని.. గేమ్‌ప్లాన్‌లో భాగంగానే కొన్నిసార్లు బౌలర్లు ఇలా రెచ్చగొడతారంటూ తేలికగా తీసిపడేశారు. ఇక ఈ విషయంపై హర్షా భోగ్లే క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘అవుటైన తర్వాత జైస్వాల్ వెళ్లిపోతున్న సమయంలో అతడిని ఎవరో ఏదో అన్నారు.

జైస్వాల్‌ ఏమీ అనకుండా వెళ్లాల్సింది
నిజానికి బౌలర్లు సెండాఫ్‌ ఇవ్వడం నా దృష్టిలో అంత గొప్పేమీ కాదు. బౌలర్‌గా బ్యాటర్‌ను అవుట్‌ చేశామంటే అక్కడితో మీ పని పూర్తైనట్లు. అంతేగానీ.. ఇలాంటి చర్యలు అవసరం లేదు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితిలో బ్యాటర్‌ ఎదుటివాళ్ల మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే మంచిది. కానీ జైస్వాల్‌ తిరిగి వచ్చాడు.

వాళ్లు ఏమన్నారో జైస్వాల్‌కు మాత్రమే తెలుసు. బౌలర్‌ అలా అనకుండా ఉండాల్సింది. కానీ జైస్వాల్‌ నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిక్‌బజ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. జైస్వాల్‌ స్పందించాడు.

మీకేం తెలుసు?.. తెలియకుండానే జడ్జిమెంట్లా?
‘‘సదరు ఆటగాడు ఏమన్నాడో మీకు తెలియకుంటే.. ఇలాంటి తీర్పులు ఇవ్వడం ఆపండి. ఎవరైనా హద్దులు మీరి ప్రవర్తిస్తే.. భారత్‌ తిరిగి పోరాడుతుందని.. వాళ్లకు గట్టిగానే బదులు ఇస్తుందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని జైస్వాల్‌ కామెంట్‌ సెక్షన్‌లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. హర్షా భోగ్లేకు కౌంటర్‌ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే.. రెండో టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది భారత్‌. సోమవారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి 112 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 419 పరుగులు సాధించింది. రిషభ్‌ పంత్‌ 63, ధ్రువ్‌ జురెల్‌ 59 పరుగులతో ఉన్నారు.

చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్‌ పంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement